ఓ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులు మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్నారు.. రాజకీయాల్లో వచ్చిన కొత్త మార్పు ఇదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితులను నిలుపుదల చేయాల్సి ఉందన్నారు. చత్తీస్‌గడ్‌కు చెందిన అడిషనల్ డైరక్టర్ ఆఫ్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్ కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఏడీజీ హోదాలో ఉన్న గుర్జిందర్ పాల్‌పై చత్తీస్ఘడ్ ప్రభుత్వం ఇటీవల దేశద్రోహం కేసు నమోదు చేసింది. జార్ఖండ్‌లోని ఆయన ఇంటిపై ఏసీబీ, ఎకనామిక్ అఫెన్సిస్ వింగ్ అధికారులు గత జూన్‌లో సోదాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటి వెనుక చెత్తకుప్పలో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయని.. వాటిని విశ్లేషిస్తే రాజకీయాల లెక్కలు, విమర్శలు అలాగే కొంత మంది ప్రజాప్రతినిధులకు సంబంధించి సమాచారం ఉందని కేసు నమోదు చేశారు. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణిస్తూ కేసు పెట్టారు. సస్పెండ్ చేశారు. అయితే దీనిపై తనను అరెస్ట్ చేయకుండా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కేసు పరిణామక్రమాన్ని తెలుసుకున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. రాజకీయ టార్గెట్‌గా మారారన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. నాలుగు వారాల పాటు ఆయనను రక్షణ చేయకుండా రక్షణ కల్పించింది.
సీజేఐ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు కేసుకు కూడా వర్తించే అవకాశం ఉంది. ఆయన తాను ఎలాంటి నేరం చేయలేదని కొనుగోళ్ల జరగని అంశంలో తనను దోషిగా చూపించాలని చూస్తున్నారని న్యాయపోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఆయనకు ఈ ప్రభుత్వం లో కనీసం జీతం కూడా రావడం లేదు. సుదీర్ఘంగా సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇటీవల ఆయనను డిస్మిస్ చేయాలని కూడా ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు.