ముందస్తు ఎన్నికల కోసం…టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీతో పాటు .. పోలీసుల్ని కూడా ముందస్తుగానే సిద్ధం చేశారా..?. కాంగ్రెస్ కీలక నేతలపై వరుసగా నమోదవుతున్న కేసులు చూస్తే.. ఇదే నిజమనిపించక మానదు.14 ఏళ్ల కిందటి కేసులో…సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో కొత్త విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా..? అంటే ఏమీ రాలేదు. అదేదో కొత్త క్రైమ్ అన్నట్లుగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేశారు. ఆ అరెస్ట్ కూడా.. చాలా టైమింగ్ ప్రకారం చేశారు. బుధవారం సంగారెడ్డిలో మైనార్టీ సదస్సును… కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతను జగ్గారెడ్డి తలకెత్తుకున్నారు. ఆ పనిలో ఉండగానే ఆయనను అరెస్ట్ చేశారు. దాంతో సభ వాయిదా పడిపోయింది.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ తరపున కీలక నేతగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డిపై హఠాత్తుగా ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గండ్ర సోదరుడు.. స్టోన్ క్రషర్ వ్యాపారం నిర్వహిస్తూంటారు. ఆ వ్యాపార భాగస్వాములతో విబేధాలు వచ్చాయి. వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీని పోలీసులకు అంది వచ్చింది. స్టోన్ క్రషర్ యాజమాని రవీందర్రావు ఫిర్యాదు చేశారని.. గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డిపై 27, 323, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గండ్ర రవీందర్ రావును తుపాకీతో బెదిరించారట.నిజానికి గండ్రను టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల కిందట.. ఓ మహిళతో గండ్రపై ఆరోపణలు చేయించి లైంగిక వేధింపులు కేసు నమోదు చేయించారు. కానీ ఆ మహిళ అన్నీ అబద్దాలు చెబుతోందని తేలడంతో పోలీసులు ముందడుగు వేయలేదు.
ఇంత సిన్సియర్ గా పోలీసులు పని చేస్తూంటే.. ఇక రేవంత్ రెడ్డిని మాత్రం వదిలి పెడతారా..? . జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డిపై కేసు నమోదయిందని… విచారణకు రావాలని.. జూబ్లిహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇళ్ల స్థలాలు అమ్మారనేది పోలీసుల అభియోగం. రేవంత్‌రెడ్డితో పాటు 13మందికి నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. అయితే రేవంత్ మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, కొంత సమయం కావాలని…పోలసులకు లేఖ రాశారు. ఈ దశలో ఎవరినీ అరెస్ట్ చేసే అవకాశం లేదని జూబ్లిహిల్స్ పోలీసులు చెబుతున్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వమే అయినా పోలీసుల్ని గుప్పిట పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడుతున్నారన్న విమర్శలు భారీగానే వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే.. పోలీసుల పనితీరుపైనే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందన్న ఆందోళన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.