జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా తొండంగి పర్యటనకు వెళ్తారా లేదా అన్న సస్పెన్స్ ప్రారంభమయింది. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని జనసేన నేతలు పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే పోలీసులు దాన్ని తరిస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం తొండంగిలో… 144 సెక్షన్ ఉన్నందున… ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి ఉండదని పోలీసులు సమాధానం పంపారు. ఈ విషయాన్ని జనసేన నేతలు… పార్టీ హైకమాండ్‌కు సమాచారం పంపారు. నిజానికి ఇలాంటి కార్యక్రమాలకు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అనుమతి తీసుకోదు.
పోలీసులు అడ్డుకుంటే.. దాన్నో ఇష్యూగా చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే జనసేనాని మాత్రం పోలీసుల పర్మిషన్‌తోనే వెళ్లాలని అనుకున్నారు. అందుకే ధరఖాస్తు చేయించారు. దివీస్ పరిశ్రమ విషయంలో.. అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆ పరిశ్రమపై దాడులు కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ అక్కడ పర్యటిస్తే.. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని పోలీసులు చెబుతున్నారు. అయితే.. జనసేనాని ముందుగానే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. సోషల్ మీడియాలో భారీగానే ప్రచారం చేసుకున్నారు.
తీరా… ఒక్క రోజు ముందు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్.. తన దివీస్ టూర్‌ను వాయిదా వేసుకుంటారా…లేక ధైర్యంగా ముందుకెళ్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అనుమతి ఇవ్వలేదన్న కారణంతో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా.. తన పర్యటనలు వాయిదా వేసుకోరు. పవన్ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.