మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియకు బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో బెయిల్ రాకూడదన్న వ్యూహాన్నే పోలీసులు అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టు నిర్ణయం తీసుకోనున్న సమయంలో… పోలీసులు అనూహ్యంగా కొత్త సెక్షన్లను జోడించినట్లుగా కోర్టుకు తెలిపారు. కస్టడీ కూడా ముగిసినందుకు అఖిలప్రియకు బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే.. అఖిలప్రియపై ఇంకా కఠినమైన సెక్షన్లు పెట్టి కోర్టుకు తెలియచేశారు. ఆ సెక్షన్లలో కొన్ని యావజ్జీవ శిక్ష పడేంత తీవ్రమైనవి కావడంతో.. సికింద్రాబాద్ కోర్టు… అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయింది. తమ పరిధి కన్నా ఎక్కువ కాబట్టి.. పై కోర్టులో పిటిషన్ వేసుకోవాలని అఖిలప్రియ న్యాయవాదులకు సూచించింది.
దాంతో వారు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. మొదట ఏ-2గా ఉన్న అఖిలప్రియను ఆ తర్వాత ఏ -1 గా మార్చారు. పోలీసులు దాదాపుగా ప్రతీ రోజూ ప్రెస్ మీట్ పెట్టి.. అఖిలప్రియనే కిడ్నాప్ ప్లాన్ చేసి.. అమలు చేసిందని.. అదే పనిగా ప్రచారం చేశారు. పది మంది.. పదిహేను మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో అఖిలప్రియపై సెక్షన్లు కూడా పెంచేశారు. ఈ కేసులో ముందు నుంచీ భార్గవరామ్, గుంటూరు శ్రీనుల గురించి పోలీసులు కథలు.. కథలుగా చెబుతున్నారు. కానీ.. వారిని మాత్రం అరెస్ట్ చేయలేదు.
అసలు ప్రవీణ్ రావు సోదరులతో వివాదం ఏమిటన్న అంశం జోలికి వెళ్లకుండా.. కేవలం.. భూమా అండ్ ఫ్యామిలీని వీలైనంతగా మానసిక ఒత్తిడికి గురి చేయడానికే నన్నట్లుగా పోలీసు వ్యవహారం ఉందని… అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఓ వర్గం మీడియాకు తప్పుడు సమాచారం లీక్ చేసి.. ఏదేదో ప్రచారం చేస్తున్నారని కూడా అంటున్నారు. మొత్తానికి గర్బిణీగా ఉన్న అఖిలప్రియ విషయంలో పోలీసులు బెయిల్ కూడా రాకుండా పోలీసు తెలివితేటల్ని ప్రదర్శించడానికి ఆమె వర్గీయులు ఖండిస్తున్నారు.