ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలపై సాగుతున్న రాజకీయ కక్ష సాధింపుల కోసం.. పోలీసులు ఎంతకైనా తెగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జనసేన నేత, తాడేపల్లి గూడెం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో పోలీసులు అర్థరాత్రి సోదాలు చేశారు. ఎందుకు చేశారో.. ఎవరికీ తెలియదు. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు. హడావుడిగా వచ్చిన పోలీసులు… ఇంట్లో అణువు అణువూ శోధించారు. ఈ సోదాల విషయాన్ని వీడియో కాల్ చేసి.. ఎస్పీకి చూపించారని బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా.. అని ఆయన మండిపడుతున్నారు.
బొలిశెట్టి శ్రీనివాస్.. జనసేనలో కీలకంగా ఉన్న నేత మాత్రమే కాదు. ప్రత్యర్థులపై విరుచుకుపడే నేత. ఇటీవల.. పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని, పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ఆయన వారి భాషలోనే కౌంటర్ ఇచ్చాడు. ఆయన చేసిన విమర్శలు.. తిట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసైనికులు పెద్ద ఎత్తున బొలిశెట్టి శ్రీనివాస్ వీడియోను సర్క్యూలేట్ చేశారు. ఇలా ప్రతి విమర్శలు చేసినందుకే.. పోలీసులు ఎలాంటి ఆరోపణలు లేకపోయినా.. పండగ పూట… కేవలం వారి కుటుంబంలో భయానక వాతావరణం సృష్టించడం కోసమే హడావుడి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొలి శెట్టి శ్రీనివాస్ కూడా.. అదే చెబుతున్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు.
విమర్శలకు ప్రతి విమర్శలు చేసినా అధికార పార్టీ నేతలు సహించలేకపోతున్నారని..పోలీసుల్ని పంపి వేధిస్తున్నారని కొంత కాలంగా.. విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అది మరింత ఎక్కువైన సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా.. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా.. ఏదో ఓ ఫిర్యాదు వచ్చిందనో… సమాచారం వచ్చిందనో సోదాలు జరిపి.. ఆయనా విపక్ష నేతలను.. వారి కుటుంబాలను భయపెడుతున్నారని చెబుతున్నారు. స్వయంగా ఎస్పీకి బొలిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో సోదాలను వీడియో కాల్లో చూపించడం మరింత వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది.