ఫోన్ రింగవుతుంది..!
అవతల కంగారు కంగారుగా గొంతు…” సార్ మీ ఇంట్లో సోదాలు చేయడానికి ఆదాయపు పన్ను అధికారులు వస్తున్నారు..! అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
వెంటనే పోన్ అందుకున్న వ్యక్తి… హుటాహుటిన తన ఇంట్లో ఉన్న సంపాదన అంతా.. డబ్బు, దస్కం. డాక్యుమెంట్లు సూట్‌కేసులో పెట్టి.. డ్రైవర్‌కి ఇచ్చి పంపేస్తారు. ఇంకా ఎక్కువ ఉంటే.. శివాజీ సినిమాలోలా ట్రంకు పెట్టెల్లో పెట్టి.. డ్రైవర్‌కు ఇచ్చి సీక్రెట్ ప్లేస్‌కి పంపేస్తారు. అనంతపురంలోనూ అదే జరిగింది. కానీ దొరికిపోయారు. కానీ ఇక్కడ వచ్చింది ఐటీ అధికారులు కాదు పోలీసులు… మిగతా అంతా సేమ్ టు సేమ్. అయితే.. ఇక్కడ ఆ తరలించిన ట్రంక్ పెట్టెలు దొరికిపోవడమే ట్విస్ట్.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఓ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. అది చాలా చిన్న ఇల్లు. రేకుల ఇల్లు. అందులో ఎనిమిది ట్రంకుపెట్టేల్ని పోలీసులు గుర్తించారు. వాటిని తెరిచి చూస్తే… ఖాజానా బయటపడింది. పెట్టెల్లో 2.42 కిలోల బంగారు ఆభరణాలు, 84.10 కిలోలు వెండి ఆభరణాలు, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.27.05 లక్షల విలువైన బాండ్లు లభించాయి. వీటన్నింటినీ సీజ్ చేశారు. అయితే.. ఓ చిన్న రేకుల ఇంట్లో అంత పెద్ద ఖజానా బయటపడటం అంటే… వెనుక ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అది కూడా ఖాజనానే. ఆ సొమ్మంతా… ఏపీ ట్రెజరీ ఉద్యోగి మనోజ్దిగా గుర్తించారు. కానీ ఆ ఇల్లు మాత్రం మనోజ్‌ది కాదు. మనోజ్ వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్న నాగలింగం అనే వ్యక్తిది. .. అంటే సీన్ అర్థమైపోయింది కదా.. తన ఇంట్లో సోదాలు చేస్తారని.. మొత్తం కట్టకట్టి నాగలింగంకు ఇచ్చి పంపించాడు మనోజ్.
ట్రెజరీలో పని చేస్తూ బిల్లులు పాస్ చేయాలంటే.. లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసే మనోజ్‌కు.. తన భార్యతో వివాదాలున్నాయి. ఈ గొడవల్లో ఓ సారి ఆయన తుపాకీ చూపించి భార్య బంధువుల్ని బెదిరించారు. వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుపాకీ అనే సరికి పోలీసులు కూడా ఉలిక్కి పడ్డారు. పోలీసులు వస్తున్నారని తెలిసి.. మొత్తం ఖజానాను మూటగట్టి మనోజ్ నాగలింగంతో పంపాడు. కానీ పోలీసులు కనిపెట్టి.. బయటకు తీశారు. ఈ ట్రంకు పెట్టెల్లో.. రెండు రివాల్వర్లు కూడా ఉన్నాయి.
ఆ తర్వాత మనోజ్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు మరిన్ని ఆస్తులు కనిపించాయి. మనోజ్ లైఫ్ స్టైల్ చూసి… పోలీసులు నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. రెండు ఖరీదైన కార్లు… హార్లీ డేవిడ్సన్తో పాటు అతి ఖరీదైన బైకులు.. నాలుగు ట్రాక్టర్లను కూడా గుర్తించారు. ఇవన్నీ పెట్రోల్‌తో నడిచేవి… ఎప్పటికైనా సమస్య వస్తుందని అనుకున్నాడేమో కానీ.. నాలుగు గుర్రాలు కూడా కొన్నాడు. ఈ మొత్తం వివరాలను ఐటీ అధికారులకు కూడా అప్పగించారు. మొత్తం లెక్కలు వారు బయటకు తీసే అవకాశం ఉంది.