తెలంగాణ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఆదివారం నాడు ఇళ్ల నుంచి బయటకు రాని ప్రజలు సోమవారం నాడు తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చేశారు. దీంతో వారిని సముదాయించి ఇళ్లకు పంపడం పోలీసులకు కష్టసాధ్యమైంది. దీంతో సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి చర్యలకు తావివ్వని పోలీసులు రాత్రి మాత్రం తమ నిబంధనల కొరడా బయటకు తీసారు. తెలంగాణ రాజధానితో సహా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో 1058 మోటారు సైకిళ్లు, 948 ఆటోలు, 449 కార్లు, 2480 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాజధాని పరిధిలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో 73 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మంగళవారం నాడు ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సమయంలోనే రైతు బజార్లు, కిరాణా దుకాణాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31 వరకూ ప్రజలు నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బాలీవుడ్ తారలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సందేశాలు ఇస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని వ్యాపార సంస్థలు ప్రజలను నిలువునా ముంచేలా ధరలను పెంచేశాయి. మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకూ ప్రజలు నియమ నిబంధనలు పాటించకపోతే సీరియస్ చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కూడా హెచ్చరించారు.