హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైన కత్తి మహేష్ పై ఆంధ్రప్రదేశ్ లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాముడు, సీతపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఆయనను హైదరాబాద్ పోలీసులు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించి.. కర్ణాటకలో విడిచిపెట్టారు. కత్తి మహేష్… రెండు రోజుల కిందట.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకకవర్గంలో ఉన్న స్వగ్రామానికి వచ్చారు. అక్కడ ఆయన మీడియా సమావేశం పెట్టాలనుకున్నారు. ఈ విషయం తెలిసి చిత్తూరు జిల్లా పోలీసులు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ విడిచిపెట్టారు.
కత్తి మహేష్ ను లా అండ్ ఆర్డర్ కారణంగా చూపి.. ఓ నరగం నుంచి బహిష్కరించడంతో ఏపీ పోలీసులు కూడా.. ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయకపోయినా.. అదే తరహా ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. కత్తి మహేష్.. మీడియా సమావేశంలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడతారన్న ఉద్దేశంతోనే పోలీసులు ఆయననను పీలేరు నుంచి తరలించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేసిన తర్వాత సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు కత్తి మహేష్. అయితే రాముడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.పైగా రాముడికి సంబంధించిన ఓ భక్తి గీతాన్ని స్వయంగా ఆలపించి సోషల్ మీడియాలో పెట్టారు. దానికి పరిపూర్ణానంద కూడా అభినందించారు.
కత్తి మహేష్.. సమాజంలో అశాంతికి కారణమయ్యేలా మాట్లాడుతున్నారన్న అభియోగాలు ఉండటంతో.. ఆయన ప్రెస్ మీట్లను ప్రసారం చేయడానికి మీడియా సంస్థలు కూడా సిద్ధంగా లేవు. రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన సంస్థకు ఇప్పటికే..తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో పరిపూర్ణానంద చేయబోయిన యాత్ర విషయంలో.. ప్రజల్లో అలజడి రేపడానికి ప్రయత్నించందన్న కారణంతో.. ఆయనకు సంబంధించిన భారత్ టుడే చానల్ ప్రసారాలనును దాదాపుగా నిలిపివేయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మీడియా వాచ్ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో.. కత్తి మహేష్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ప్రసారం చేసేందుకు టీవీ చానళ్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అసలు మీడియా ముందుకు రాకుండా… రెండు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కత్తి మహేష్ కు ఆరు నెలలు పబ్లిసిటీ రాదని చెప్పుకోవచ్చు.