చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదు. 150 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్లు ఇచ్చారని చెబుతున్న చట్టం ప్రకారం జారీ చేసిన జీవోను చూపించి ర్యాలీలు చేయకూడదు.. రోడ్ షోలు నిర్వహించకూడదని అడ్డుకున్నారు. కుప్పంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసులు రోడ్ షోలు నిర్వహించకూడదని.. మైకులతో ప్రసంగించకూడదని అడ్డుకున్నారు. పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. రాసివ్వమని అడిగారు. పోలీసులు.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను తెచ్చి ఇచ్చారు. అసలు ఈ చట్టాన్ని ఎప్పుడు ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటో చెప్పాలని పోలీసుల్ని చంద్రబాబు నిలదీశారు. పోలీసుల వద్ద సమాధానం లేదు.
పెద్దూరు గ్రామంలో చంద్రబాబు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించాలని షెడ్యూల్ లో ఉంది. దీంతో తాను గ్రామంలో పాదయాత్ర ద్వారా ఈ కార్యక్రమాని నిర్వహిస్తాని.. తన ప్రచార వాహనాన్ని తెచ్చివ్వకపోతే.. పెద్దూరులోనే ధర్నా చేస్తానని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఎప్పుడూ కనీసం వంద మందితో కూడా భద్రత కల్పించరు. కానీ అడ్డుకోవడానికి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు వేల మంది పోలీసుల్ని రప్పించారు. ప్రత్యేక బలగాల్ని తరలించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తే ఏమవుతుందో కానీ… ఉదయం నుంచి కార్యకర్తలు చంద్రబాబు పర్యటనలో పాల్గొనకుండా భయబ్రాంతులకు గురి చేశారు. ఇష్టం వచ్చినట్లుగా లాఠీ చార్జ్ చేశారు.
చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చినా వైసీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడేవి. కానీ ఈ సారి ఆ బాధ్యతను స్వయంగా పోలీసులే తీసుకున్నారు. చిన్న గ్రామంలో గ్రామ సభ నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్న స్టేజీని కూడా తొలగించారు. వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు అలా ఎలా స్వాధీనం చేసుకుంటారన్న దానికీ సమాధానం లేదు. డ్రైవర్ నూ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ ప్రతిపక్ష నేత తన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడం ఏమిటని.. ఇదేం పోలీసింగ్ అన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా పోలీసులు ఇక వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.