” మేం అధికారంలోకి వస్తే బాధితులపైనే కేసులు పెడతాం ” అని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఓ ఘటన విషయంలో ఆవేశపడుతూ చెప్పారు. ఆయన అలవాట్లో పొరపాటుగా అలా అన్నారేమో అని అప్పట్లో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ట్రోలింగ్ చేశారు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత.. ఇప్పుడు చాలా ఆలస్యంగా అనుకుంటున్నారు. అప్పట్లో ఆయన కరెక్టుగానే చెప్పారు.. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత అసలు విషయం అర్థమయిందని. చెప్పుకోవడానికి కాస్త వ్యంగ్యంగా ఉన్నా.. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది కళ్ల ముందు కనిపించే నిజం.
మాచర్ల ఘటనలో బాధితులపైనే హత్యాయత్నం కేసులు
మాచర్లలో ఏం జరిగిందో కళ్ల ముందు కనిపిస్తోంది. గడప గడపకూ కార్యక్రమం కోసం ప్రతీ ఇంటికి వెళ్తున్న టీడీపీ నేతల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు గొడవ చేశారు. దాడులు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. బ్రహ్మారెడ్డిని పట్టణం నుంచి బలవంతంగా తరలించి ఇష్టారీతిన దాడులు చేశారు. చివరికి ఆయనపైనే కేసులు పెట్టారు. కానీ టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలు సహా కార్యకర్తలపై ఇళ్లపై దాడులు చేసి లూఠీలకు పాల్పడిన వారిపై మాత్రం బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇది వైసీపీ ప్రభుత్వం అమలు చేసే రాజ్యాంగంలో ప్రత్యేకమైనది. ఇది లెటెస్ట్‌గా జరిగింది.. కొన్ని వందల ఘటనల్లో బాధితులపైనే కేసులు పెడుతున్నారు.
పట్టాభి ఇంటిపై దాడి… టీడీపీ ఆఫీసుపై దాడి.. ఇలా ఏం జరిగినా బాధితులపైనే కేసులు !
వైసీపీ నేతలు ఒక్క మాచర్లలోనే ఇలా చేయడం లేదు. రాష్ట్రం మొత్తం చేస్తున్నారు. పోలీసులు ఒక్క మాచర్లలోనే ఇలా బరి తెగించి… నేరస్తులకు అండగా నిలవడం లేదు. అన్ని చోట్లా చేస్తున్నారు. విజయవాడలో పట్టాభిరాం ఇంటిపై రెండు సార్లు దాడి జరిగింది. ఆయనపై ఓ సారి హత్యాయత్నం జరిగింది. కానీ కేసులు పెట్టలేదు..నిందితుల్ని పట్టుకోలేదు. రివర్స్ లో ఆయనపై కేసులు పెట్టి జైలుకు కూడా పంపారు. టీడీపీ ఆఫీసుపై అంత పక్కాగా … దాడి చేస్తే.. కనీసం కేసుల్లేవు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలపై ఈ దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా… పోలీసుల కేసులు మాత్రం వారిపైనే పెడుతున్నారు. హతంకులు.. దోపిడిదారులకు మాత్రం భరోసా ఇస్తున్నారు.
హంతకులు, నేరస్తులకూ ఎప్పుడూ లభించనంత ఆభయం !
ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఈ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఒక్కడే ఎలా చేస్తాడు.. అనే దగ్గర్నుంచి అనేక కోణాలు ఉన్నాయి. కానీ పోలీసులు అసుల విచారణే చేయలేదు. పైగా కోర్టు విచారణలో ఆయనపై ఎలాంటి నేరాలు లేవని అబద్దాలు చెప్పారు.ఆయనపై రౌడీ షీట్లు ఉన్నాయి. ఆయన చేసే అరాచకాల గురించి అందరికీ తెలుసు. అయినా ఖాకీ డ్రెస్ లో ఉన్న పోలీసులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు. రాయలసీమ అయినా.. కోస్తా అయినా.. ఉత్తరాంధ్ర అయినా ఇదే పరిస్థితి. ఏపీ ప్రజల్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టడానికి .. పోలీసులూ తమ వంత సహకారం అందిచండమే అసలైన దౌర్భాగ్యం.
భయపెట్టి పరిపాలించడం ప్రజాస్వామ్యంలో సాధ్యమేనా ?
అధికారుల్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని భయపెట్టి పరిపాలించడం .. తర్వాత అలాగే గెలవాలనుకోవడం అమాయకత్వం. ప్రజాస్వామ్యం గురించి తెలియని రాజకీయనాయకులు.. దక్కిన అధికారం తలెకెక్కి చేసే వికృత రాజకీయ ఆట. తమకు ఇక ప్రజలు ఓట్లు వేయరని డిసైడైపోయి చేసుకునే అరాచక రాజకీయం. ఇలా చేస్తే.. వేసే వాళ్లు కూడా వేయరు. చివరికి ఓటమే ఎదురవుతుంది. ఆ తర్వాత ఇలాంటివే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది రాష్ట్రానికి.. ప్రజలకు ప్రమాదకరం.