ప్లాస్టిక్ వేలిముద్రలు తయారు చేసి.. అక్రమాలకు పాల్పడుతున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు జాతీయ స్థాయిలో సంచలనాత్మకమయింది. ఆధార్ భద్రతపై అనుమానాలు రేకెత్తించే స్కాం కావడమే దీనికి కారణం. మొదట సిమ్ కార్డులు అమ్మితే వచ్చే కమిషన్ కోసమే ఈ పని చేశారన్న సంతోష్.. ఆ తర్వాత ఒక్కొక్క నిజాన్ని బయట పెడుతూ వస్తున్నారు. నకిలీ వేలిముద్రలతో ఆధార్ అనుసంధానం చేసుకున్న సంతోష్‌కుమార్ కొందరు రేషన్ డీలర్లతో కుమ్మక్కయి టన్నులకొద్దీ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసినట్లు తాజాగా గుర్తించారు.
ఆధార్ కార్డులు వేలిముద్రలతో ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. ఒకరి వేలిముద్రలు మరొకరు వేయలేరు. నకిలీలు తయారుచేయలేరని నిపుణుల భావన. కానీ .. సంతోష్ దాన్ని చాలా సింపుల్‌గా హ్యాక్ చేసేశాడు. ఇంతకీ వేలి ముద్రలు ఎలా డౌన్లోడ్ చేశాడంటే… రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి.. డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. వాటిపై వేలి ముద్రలు ఉంటాయి. ఆ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుని కావాల్సిన వేలి ముద్రలకు..ప్లాస్టిక్ తొడుగులు తయారు చేయించారు. వాటితో …సిమ్ కార్డులు యాక్టివేట్ చేయించడం… రేషన్ సరుకులు తీసుకోకపోయినా తీసుకున్నట్లు వేలిముద్రలు వేయించడం చేయించాడు.
ఇదే సాంకేతిక పరిజ్ఞానం గనుక దేశవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదకరమని పోలీసులు భయపడుతున్నారు. నకిలీ వేలిముద్రలు ఇంత సులభంగా తయారు చేయవచ్చన్న విషయం బయటపడితే సంఘ విద్రోహకర శక్తుల ఆగడాలకు అంతే ఉండదన్న ఆందోళనలో పోలీసు అధికారులున్నారు. దీంతో.. వెబ్సైట్లు, సోషల్ మీడియా నుంచి నకిలీ వేలిముద్రలు, వాటి తయారీకి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయించడానికి నిఘావర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు దేశం దృష్టిని కూడా ఆకర్షించింది. అసలు సంతోషన్ ఈ నకిలీ వేలిముద్రలతో తీసుకున్న ఆరు వేల సిమ్‌కార్డులు ఎవరి చేతికి వెళ్లాయన్నదానిపై… ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో ఇంకెన్ని టెర్రర్ లింకులు బయటపడతాయో మరి..!