మంత్రి అప్పలరాజు పోలీసుల్ని తిట్టిన తిట్లపై ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు కూడా పెట్టలేదు. కానీ డీజీపీ సవాంగ్ సహా పోలీసు శాఖ బాధ్యులు ఎక్కడ కనిపించినా ప్రధానంగా అదే ప్రశ్న మీడియా నుంచి వస్తోంది. కానీ సవాంగ్ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మంత్రి అప్పల్రాజు పోలీసుల్ని తిట్టిన తిట్లు ఆ శాఖ ఉద్యోగుందర్నీ ఆవేదనకు గురి చేస్తున్నాయి. ప్రైవేటు సంభాషణల్లో మరీ అలా తిట్టించుకునే స్థాయికి వ్యవస్థను దిగజార్చేశామా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ఆగ్రహం అక్కడక్కడా బయటపడుతోంది. అసంతృప్తి పోలీసు శాఖ నిండా ఉంది. కానీ ప్రతిపక్ష నేతల మీద ప్రెస్మీట్లు పెట్టినంత ఈజీగా మంత్రుల మీద పెట్టలేరు. అందుకే అంతర్గతంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
మంత్రిపై చర్యలు తీసుకుంటేనే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుందన్న సందేశం పంపుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో పోలీసు శాఖ పనితీరు పట్ల ఓ రకమైన అభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలతో అది మరింత బలపడుతుంది. అందుకే అప్పల్రాజుపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పోలీసు శాఖ నుంచి ప్రభుత్వానికి బలంగానే వెళ్తోంది. తమ గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నారు. గతంలో ఓ ఎస్పీని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దూషించినా ఏ చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత మరికొన్ని ఘటనలు జరిగాయి.
ఇప్పడు అప్పల్రాజుపైనా ఏ చర్యలు తీసుకోకపోతే పోలీసు శాఖకు ఇబ్బందికర పరిస్థితేనని.. అలాంటివి మరింత పెరుగుతాయన్న ఆందోళన ఉంటుంది. పోలీసు వ్యవస్థ అసంతృప్తికి గురయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఉద్యోగుల చలో విజయవాడ సమయంలో తేటతెల్లమయింది. అందుకే ప్రభుత్వం అప్పల్రాజుపై పోలీసుల్ని సంతృప్తి పరిచేలా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. ఆయనతో కనీసం క్షమాపణలు చెప్పించకపోతే పోలీసుల్లో అసంతృప్తి పెరిగుతుందన్న ఆందోళన వైసీపీ పెద్దల్లో కనిపిస్తోంది.