ఎస్పీపై దాడి చేస్తే ఆయనను కాపాడుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. దూసుకొచ్చిన ఆందోళనకారులకు ఇంత కన్నా ధైర్యం ఇచ్చే ఘటన ఏముంటుంది..? ఎస్పీనే గాయపడిపారిపోయారనుకున్న తర్వాత విధ్వంసకారులు రెచ్చిపోయారు. పోలీసులు చేతులెత్తేశారు. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. జిల్లాకు పేరు పెట్టాలని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. ప్రజలందరితో చర్చించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించింది.
రాజకీయ అవసరాల కోసం మరింత పెంచుతూ.. పాలకులే వ్యూహాలు అమలు చేస్తూండటంతో ప్రజలు నలిగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమలాపురంలో వ్యవస్థీకృతంగా దాడులు జరిగాయి. ముందుగా కలెక్టరేట్ పై.. ఆ తర్వాత మంత్రులు.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇంత జరుగుతున్న విషయాన్ని పోలీసులు కనీసం గుర్తించలేకపోయారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఈ విషయంలో ఘోరంగా ఫెయిలయిందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఇంతపెద్ద విధ్వంసం జరుగుతుందని తెలిస్తే.. పోలీసుశాఖలో ఉన్న అన్నిరకాల వ్యవస్థల్లో.. ఏ ఒక్క దానికైనా సమాచారం అందుతుంది. దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అమలాపురంలో జరిగిన ఘర్షణల విషయంలో అలాంటి కనీస సమాచారం పోలీసు శాఖకు అందలేదు. అంటే ఇంటలిజెన్స్ ఎంత ఘోరంగా ఫెయిలయిందో అర్థం చేసుకోవచ్చు.
ఆందోళనకారులు విరుచుకుపడబోతున్నారన్న కనీస సమాచారం ఉన్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. ఉద్రిక్తలు ఉన్నా.. అమలాపురంలో పోలీసులు మూడు వందల మంది మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అదనపు పోలీసు బలగాలు లేవు. దీంతో ఆందోళనకారులకు ఎదురు లేకుండా పోయినట్లయింది. పోలీసులు చేతులెత్తేశారనన ప్రచారం జరగడం మరింత ఉద్రిక్తతలకు కరణం అయింది.
రాజకీయ అవసరాల కోసం పోలీసు వ్యవస్థను గరిష్టంగా ఉపయోగించుకుంటూ… లా అండ్ ఆర్డర్ అంశంపై నిర్లక్ష్యం చేయడంతోే సమస్యలు వస్తున్నాయి. సొంత వర్గానికి ప్రాధాన్యత కోసం పోలీసు ఉన్నతాధికారులుగా అసమర్థుల్ని నియమించడం.. వారితో రాజకీయ ఆట ఆడుకోవడంతో సమస్య వచ్చింది. ఇప్పుడు అది ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.