ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై వరుసగా జరుగుతున్న దాడుల ఘటనల్లో వైసీపీ నేతల్ని కాపాడటానికి పోలీసుల్నే బలి పశువులు చేస్తున్న వైనం.. రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఇంత కాలం ముఖ్యమంత్రి స్పందిస్తారని ఎదురు చూశారు. చివరికి ముఖ్యమంత్రి కూడా.. పోలీసుల్నే తప్పు పట్టారు. పోలీసులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆశ్చర్యపోయారు. ” హోంమంత్రి ఎస్సీ.. డీజీపీ ఎస్టీ అయినా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలని ” హితవు పలికారు. దళితులపై దాడులు చేస్తే పోలీసుల్నే అరెస్ట్ చేయించామని ప్రకటించారు. కానీ ఇక్కడ వస్తున్న మౌలికమైన సందేహం.. దళితుల్ని పోలీసులు ఎందుకు టార్గెట్ చేస్తారు..? వైసీపీ నేతల ప్రోద్భలంతోనే కదా..? ఇప్పటి వరకూ ఏపీలో దళితులపై జరిగిన పోలీసుల దాష్టీకాల్ని పరిశీలిస్తే.. 90 శాతం కేసుల్లో వైసీపీ నేతల ప్రమేయం ఉంది. కానీ ఒక్కటంటే.. ఒక్క కేసులోనూ వైసీపీ నేతలపై కేసులు నమోదు కాలేదు. కానీ పోలీసులు మాత్రం జైలుకెళ్లారు.
తూ.గో జిల్లాలో జరిగిన శిరోముండనం ఘటనలో.. ట్రైనీ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. దానికి కారణం.. ఓ వైసీపీ నేత. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ వైసీపీ నేతను అడ్డుకున్నందుకు ప్రసాద్‌ను కొట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైసీపీ నేతల ప్రోద్భలంతోనే… ట్రైనీ ఎస్ఐ ఆ యువకుడికి శిరోముండనం చేయించాడు. లేకపోతే.. ఆ ఎస్ఐకు.. దళిత యువకుడిపై కక్ష ఎందుకు..? ఈ విషయంలో.. చాలా పెద్ద పెద్ద పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందుకే పోలీసులు లైట్ తీసుకున్నారు. రాష్ట్రపతి స్పందించినా… ఆ యువకుడికి న్యాయం దక్కలేదు. తీరిగ్గా స్పందించిన సీఎం.. తప్పు అంతా పోలీసులపై నెట్టేశారు. తన పార్టీ నేతల వరకూ రానివ్వలేదు.
ఒక్క ప్రసాద్ విషయంలోనే కాదు… శ్రీకాకుళం జిల్లాలో ఓ దళితుడి గుండెపై కాలుతో తన్ని మరో అధికారి వ్యవహారంలోనూ వైసీపీ నేతలదే తప్పు. దళితులపై జరిగిన అనే దాడుల ఘటనల్లో.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులున్నా.. పోలీసులు స్పందించిన తీరు అంతంతమాత్రం. విచిత్రం ఏమిటంటే.. అనేక సందర్భాల్లో.. పోలీసుల్ని బలి పశువులుగా చేస్తున్నారు కానీ.. వైసీపీ కార్యకర్తల్ని మాత్రం కాపాడుకుంటున్నారు. అక్కడే సమస్య వస్తోంది. కానీ పోలీసు పెద్దలు మాత్రం.. తమ డిపార్టుమెంట్ పరువు పోయినా పర్వాలేదు.. అసలు నిందితుల్ని మాత్రం వెలుగులోకి తేకూడదనుకుంటున్నారు. అదే వైసీపీ నేతలు ఓ సోషల్ మీడియా పోస్టు పై ఫిర్యాదు చేస్తే… అర్ఱరాత్రి.. అపరాత్రి తేడా లేకుండా… తమ సిన్సియార్టీ నిరూపించుకుంటున్నారు.