ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతే…! హీరో రామ్.. విజయవాడ స్వర్ణ హోటల్ అగ్నిప్రమాదానికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. కేసును ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లించి.. ఫూల్స్‌ను చేస్తున్నారని కొన్ని డాక్యుమెంట్లు ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరో వైపు ఆ కేసులో.. రమేష్ ఆస్పత్రి డాక్టర్లను టార్గెట్ చేశారని.. తప్పు హోటల్‌ది అయితే… ఆస్పత్రిని టార్గెట్ చేయడం.. పూర్తిగా కులం కోణంలో ఉందన్న చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో.. పోలీసులు నేరుగా హీరో రామ్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే.. రామ్‌కూ .. విచారణకు ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో నోటీసులిస్తామని నేరుగానే హెచ్చరిస్తున్నారు.
ఈ కేసును ప్రస్తుతం విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పెద్దలకు చెందిన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రామ్‌కు హెచ్చరికలు పంపారు. క్వారెంటైన్ సెంటర్‌కి కోవిడ్ కేర్ సెంటర్‌కి తేడా ఉందని.. బాబాయ్ డాక్టర్ రమేష్‌ని కాపాడుకొనేందుకు అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగులుతున్నారని ఏసీపీ అంటున్నారు. రామ్ తన దగ్గరున్న డాక్యుమెంట్లను ప్రదర్శించి.. ట్వీట్ చేశారు. రామ్ ట్వీట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏసీపీ.. రామ్ ఎవరో తనకు తెలియదన్నారు. అంతటితో అయిపోయింది.. రామ్ తాను చెప్పాలనుకున్నది చెప్పారు.
అయితే హఠాత్తుగా రామ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అదే ఏసీపీ సాక్షి మీడియాను పిలిచి ఎందుకు సీరియస్ అయ్యారో మాత్రం చాలా మందికి క్లారిటీ వస్తోంది. రామ్ మళ్లీ ట్వీట్లు చేయకుండా ఆపడం… ఈ విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడినా..ఆయనకూ నోటీసులిస్తామని హెచ్చరికలు పంపడం ద్వారా.. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మరి రామ్ వెనక్కి తగ్గుతారా..? బాబాయ్ కోసం పోలీసులపై న్యాయపోరాటానికి దిగుతారో చూడాలి..!