రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లకు సహకరిస్తున్న పోలీసులను ఉన్నతాధికారులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. ఎవరు అనేది చూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.కడప జిల్లా ఎస్పీనే బదిలీ చేశారు. ఇప్పుడు ఆ నిందితులకు సమాచారం చేరవేస్తున్న పోలీసుల్ని కూడా గుర్తించి సస్పెండ్ చేస్తున్నారు. అరెస్టు చేసినప్పుడు వారికి సకల మర్యాదలు చేస్తున్న వారికీ అదే ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలా ఇరవై మంది పోలీసుల వరకూ సస్పెండ్ అయ్యారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారంలోనే పది మందికిపైగా పోలీసులు బలయ్యారు. కడపలో వర్రా విషయంలో మరింత మంది బలయ్యారు.
సోషల్ సైకోలను ఏరివేసే ప్రయత్నాల్లో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. అయితే వారు నేరుగా తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కలిసి దందాలు చేసిన పోలీసులతో టచ్ లో ఉంటూ తమను అరెస్టు చేస్తారా … లేదా అనే సమాచారాన్ని తెలుసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు శాఖ నుంచి నేరగాళ్లకు ఇలాంటి సమాచారం వెళ్లడాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. వర్రా రవీంద్రారెడ్డి పారిపోయిన తర్వాత ఆయనతో ఇద్దరు కానిస్టేబుళ్లు రెగ్యులర్ గా టచ్ లో ఉండి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ రావడం ఉన్నతాధికారుల్ని కూడా ఆశ్చర్యపరిచింది.
వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పని తీరు అత్యంత ఘోరంగా ఉంది. వైసీపీ కోసమే పని చేసింది. వైసీపీ నేతలు నేరస్తులు అయితే వారి గుప్పిట్లో పోలీసులు పావుగా మారారు. దాడులు, దౌర్జన్యాలు విశృంఖలంగా జరిగాయి. ఆ పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. అయితే ఇంకా పోలీసులే కొంత మంది వారికి సహకరించే ప్రయత్నం చేయడం మాత్రం క్షమించరాని విషయంగా మారింది. అందుకే ఎక్కువ మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.