పందెం కోడి తరహాలో సై అంటే సై అని రాజకీయం చేస్తున్న బండి సంజయ్ దెబ్బకు పోలీసులు సైతం హడలెత్తిపోతున్నారు. బీజేపీ కార్యకర్తలపై చిన్న లాఠీచార్జ్ జరిగినా ఆయన.. నేరుగా సీఎం ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిస్తున్నారు. నేరుగా తాము కూడా దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. అలా అనడమే కాదు.. క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగిపోతున్నారు. జనగాంలో బీజేపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తీసేశారని… మున్సిపల్ ఆఫీసులో రచ్చ చేశారు బీజేపీ కార్యకర్తలు. వారు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు … వచ్చి ఆ బీజేపీ కార్యకర్తల్ని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన వారిలో జనగాం పట్టణ బీజేపీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. కొడుతున్న దృశ్యాలు మీడియాలో హైలెట్ కావడంతో బండి సంజయ్ … కాలుదువ్వేశారు.
వెంటనే చలో జనగాంకు పిలుపునిచ్చారు. కార్యకర్తలను తీసుకుని వెళ్లిపోయారు. చివరికి పోలీసులు.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. బండి సంజయ్ ను సంతృప్తి పరచడానికి పోలీసులు … తమ విధుల్లో భాగంగా చేసిన ఓ చిన్న పాటి లాఠీచార్జ్ పైనా విచారణ చేయిస్తున్నారు ఉన్నతాధికారులు. కాదంటే బండి సంజయ్ ఏ ఆందోళనలకు పిలుపునిస్తారో.. ఏ డీజీపీ ఆఫీసును ముట్టడిస్తారో… ఫామ్‌హౌస్‌లోకి ఎక్కడ చొరబడతారోననన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే ఎందుకొచ్చిన తంటా అన్నట్లుగా సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచి రంజు మీద ఉన్న పొలిటికల్ పుంజు ఏదంటే.. చుట్టూ చూడాల్సిన పని లేదు. టక్కున బండి సంజయ్ పేరు చెప్పేయవచ్చు. మాటలతో అయినా చేతలతో అయినా ఆయన ముందూ వెనుకా చూడకుండై సై అంటున్నారు. తిరుగులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్ ఇలాకాలోకి వెళ్లి తొడకొడుతున్నారు. ఆయన తీరు చూసి.. టీఆర్ఎస్ నేతలు డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టినట్లుగా ఉందని సైటెర్లు వేస్తున్నారు. అయితే.. ఈ పందెం కోడిని తేలిగ్గా తీసుకోవడానికి వారు కూడా సిద్ధంగా లేరు. సీరియస్‌గానే తీసుకుంటున్నారు.