జులాయి సినిమాలో బ్రహ్మానందం మీద ఒక డైలాగు ఉంది. ఆయన జైల్లో నిల్చుని దస్తా కాగితాలు, బస్తా పెన్లు అడుగుతాడు.. ఆత్మకథ రాసుకోవడానికి! ”గాంధీ నెహ్రూ ల కేనా ఆత్మలున్నది. మాకు కూడా ఒక ఆత్మ ఉంది. దానికి కూడా ఒక కథేడ్చింది” అని సెలవిస్తాడు. ఆ డైలాగును ఒకసారి ఇప్పుడున్న పరిస్థితికి అన్వయించుకుంటే..
”పోలీసులకు కూడా ఒక మనసుంది. ఆ మనసుకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలు కూడా గాయపడుతూ ఉంటాయి” అని డైలాగును తిరగరాసుకోవాలని అనిపిస్తుంది. అవును మరి.. తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తరఫున సినిమా టైటిళ్లకు అభ్యంతరాలు పెడుతూ వారు చేస్తున్న ఉద్యమాలను, ఇస్తున్న నోటీసులను, ఇస్తున్న ఫత్వాలను గమనిస్తే అలాగే అనిపిస్తున్నది.
తాజాగా తెలుగు ఇండస్ట్రీలు పోలీసు అధికారులు హీరోలుగా ఉన్న పాత్రలతో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వీటిలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన స్ట్రెయిట్ చిత్రం ‘మెంటల్ పోలీస్’ కాగా, తమిళనుంచి డబ్బింగ్ అయిన ‘పోలీసోడు’ చిత్రం రెండోది. ఈ రెండు చిత్రాల టైటిల్స్ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ , వెంటనే టైటిల్స్ మార్చాలని పోలీసు అధికారుల సంఘం నిర్మాతలకు నోటీసులు ఇచ్చింది. శుక్రవారం లోగా టైటిల్స్ మార్చకుంటే చట్టపరంగా ప్రొసీడ్ అవుతామని హెచ్చరించింది.
మెంటల్ పోలీస్ విషయంలో ఇంకా స్పందన రాలేదు గానీ.. డబ్బింగ్ చిత్రం పోలీసోడు శుక్రవారం నాడే విడుదల కావాల్సి ఉంది. మళ్లీ కొత్త చిక్కులు లేకుండా ఆ నిర్మాత, పోలీసు సంఘం నుంచి నోటీసులు వచ్చిన వెంటనే.. దాని టైటిల్ను ‘పోలీసోడు’ బదులుగా ‘పోలీస్’ అని మార్చేశారు. ‘మెంటల్ పోలీస్’ అనే టైటిల్ పట్ల అభ్యంతరాలుండడంలో సహజమే గానీ.. చివరికి ‘పోలీసోడు’ అనే పదాన్ని కూడా తప్పుపడితే ఎలా అంటూ సినీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయూలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతి రంగం వారు పట్టుపడితే.. ముందు ముందు టైటిల్స్ కు చాలా ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారు.