టాలీవుడ్లో ఫ్రాంచైజీ సినిమాల హవా తక్కువే. ఒకే టైటిల్ తో కథని మార్చి వరుసగా సినిమాలు తీయడం అరుదు. హిట్, హిట్ 2… ఆ లోటు కాస్త తీర్చాయి. హిట్ 3, 4, 5 కూడా వస్తాయని దర్శక నిర్మాతలు ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు `మా ఊరి పొలిమేర` కూడా ఓ ఫ్రాంచైజీగా మారిపోయింది. సత్యం రాజేష్ నటించిన `మా ఊరి పొలిమేర` లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. థియేటర్లలో విడుదల చేసి ఉంటే బాగుండేదన్న కామెంట్లు వినిపించాయి. ఇటీవల `మా ఊరి పొలిమేర 2` వచ్చింది. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని దక్కించుకొని, నిర్మాతలకు లాభాలు మిగిల్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని పంపిణీ చేయడం బాగా కలిసొచ్చింది.
ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర 3’ కూడా రాబోతోంది. దర్శకుడి దగ్గర `మా ఊరి పొలిమేర 5` కథ కూడా రెడీగానే ఉందట. నిజానికి `మా ఊరి పొలిమేర 2` తరవాత మరో కథని చేద్దామని ఫిక్సయ్యాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. అయితే ఈ సినిమాకి వచ్చిన స్పందన చూసి వెంటనే పార్ట్ 3 కి ఏర్పాట్లు చేసుకొంటున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ సారి సినిమాలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిందని సమాచారం. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ అండదండలు ఉంటే… అంతకంటే కావల్సింది ఏముంది..? పెద్ద హీరోలు, బడా నిర్మాణ సంస్థలు చేపట్టే సినిమాలకు ఫ్రాంచైజీలు రావడం కంటే, చిన్న సినిమాలకు పార్ట్ 2, పార్ట్ 3 రావడం చిత్రసీమలో మరింత మంచి శకునం. చిన్న నిర్మాతలకు ఇలాంటి ఫలితాలు కొండంత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు.