గుంటూరు జిల్లా దాటి ప్రకాశం జిల్లాలోకి అడుగు పెట్టగానే అమరావతి రైతుల మహా పాదయాత్రపై పోలీసులు గురి పెట్టారు. అనుమతి ఇచ్చిన 157 కంటే ఎక్కువే పాల్గొంటున్నారని.. రెండున్నర వేల మందితో పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఇది చట్ట విరుద్ధమని డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. అంతకు ముందే అనుమానాస్పదంగా కొంత మంది వ్యక్తులు ఫోటోలు తీస్తూంటే రైతులు పట్టుకున్నారు. అయితే తమ ఇంటలిజెన్స్ సిబ్బంది అని పోలీసులు తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా ప్రారంభంలోనే ఇలాంటి పరిణామాలు ఎదురు కావడంతో ప్రభుత్వం తన వ్యూహం ప్రారంభించిందన్న అనుమానాలు రాజధాని రైతుల్లో ప్రారంభమవుతున్నాయి.
రైతుల పాదయాత్ర పట్ల మొదటి నుంచి వైసీపీ నేతలు వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి పాదయాత్రకు అంగీకారం తెలియచేయలేదు. రాళ్ల దాడులు జరుగుతాయని.. ఉద్రిక్తతలు ఏర్పడతాయని చెప్పుకొచ్చింది. అయితే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయినా వైసీపీ నేతలు.. నందిగం సురేష్ వంటి నేతలు దాడులు జరుగుతాయని.. ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత అంటూ కొత్త అనుమానాలను రేపే ప్రయత్నం చేశారు. ఇక అన్నీ తన కనుసన్నల్లోనే ఉండేలా చూసుకూంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాదయాత్రను ప్రమాదకరమైన ఆటగా చెప్పుకొచ్చారు. ఆయన ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా రాయలసీమకు వ్యతిరేకం.. ఉత్తరాంధ్రకు వ్యతిరేకం అన్నట్లుగా మాట్లాడారు. దీంతో రైతుల్లో అనుమానాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో పాదయాత్రపై కుట్రలు ప్రారంభమయ్యాయన్న ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. నెల్లూరు, చిత్తూరు జిల్లాకు వెళ్లే సరికి దాడులు చేసినా చేస్తారన్న అనుమానాలు రాజధాని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా బెదిరించి.. పాదయాత్రకు సంఘిభావం తెలిపేందుకు ప్రజలు ఎవరూ రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారన్న భావనతో ఉన్నారు. ఎలా చూసినా ప్రభుత్వం, వైసీపీ కుట్రలను ఎదుర్కొని పాదయాత్ర చేయాల్సిందే అనే పట్టుదలతో అమరావతి రైతులు ఉన్నారు.