తెలంగాణలో సన్న బియ్యం పండించిన రైతుల కేంద్రంగా రాజకీయం ఆరోపణలు.. ప్రత్యారోపణలతో దద్దరిల్లుతోంది. కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారు.. సమస్యను పరిష్కరించే స్థాయి ఉన్న వారు.. తెలంగాణకు వచ్చి.. కేసీఆర్ సర్కార్‌పై రాజకీయ ఆరోపణలు చేసి.. రైతులతో రాజకీయం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేస్తోంది తప్ప.. రైతుల సమస్యల గురించి.. వాటి పరిష్కారం గురించి ఎక్కడా పెద్దగా ఆలోచించడం లేదు. కేసీఆర్ సర్కార్ నియంత్రిత వ్యవసాయవిధానంలో భాగంగా.. సన్న రకం బియ్యం పండించాలని నిర్దేశించింది. దానిప్రకారం రైతులు పండించారు. ఇప్పుడు పెద్ద ఎత్తున పంట వచ్చింది. కొనలేక ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఇదే అదనుగా రైస్ మిల్లర్లు దోచేసుకుంటున్నారు.
రైతుల కష్టాలతో విపక్షాలు ఒక్క సారిగా … ఒళ్లు విరుచుకుని రాజకీయం ప్రారంభించాయి. సన్న రకం ధాన్యానికి .. రూ. 2500 నుంచి 3500 వరకూ మద్దతు ధర ఇవ్వాలంటూ.. ఎంత గుర్తుకు వస్తే.. అంత డిమాండ్ చేస్తున్నారు రాజకీయ నేతలు. కేసీఆర్ చెబితేనే ఆ పంటలు వేశారని ఇప్పుడు కొనాల్సింది కూడా కేసీఆరేనని చెబుతున్నారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి హరీష్ రావు కేంద్రం ఇచ్చిన ఓ జీవోను మీడియాకు చూపించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే.. ఒక్క రూపాయిరైతులకు ఎక్కువ ఇచ్చినా తాము బియ్యాన్ని సేకరించబోమని ఆ ఉత్తర్వుల సారాంశం. కిషన్ రెడ్డి ఇక్కడ మాయ మాటలు చెప్పి రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఆయన వెర్షన్.
అయితే రైతుల సమస్యల్ని రెండు పార్టీలు గాలికొదిలేసి.. రాజకీయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచాలనుకుంటే.. కేంద్రం అడ్డుకునే అవకాశం లేదు. అయితే.. కేంద్రం సేకరించి ధాన్యానికి మద్దతు ధర మాత్రమే ఇస్తుంది. మిగతా సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది.ఇప్పుడు ఆ భారం భరించే పరిస్థితిలో తెలంగాణ సర్కార్ లేదు. పోనీ రైతుల సమస్యల్ని పరిష్కరిద్దామని.. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ ప్రయత్నిస్తుందా అంటే అదీ లేదు. కేంద్రం నుంచి పైసా ప్రయోజనం కల్పించే ప్రకటనలు చేయించడం లేదు. కానీ ఇక్కడ మాత్రం రాజకీయం చేసేస్తున్నారు. మధ్యలో రైతులు నలిగిపోతున్నారు.