ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమా అని రోడ్డున పడుతున్నాయి. ఖమ్మం అంటే పువ్వాడ అజయ్.. పువ్వాడ అజయ్ అంటే ఖమ్మం అన్నట్లుగా ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఇతర టీఆర్ఎస్ నేతలు కొంత కాలంగా పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి హోదాలో.. ఖమ్మం కార్పొరేషన్‌ను గెలిపించాల్సిన బాధ్యతను తానే తీసుకున్న అజయ్.. ఇదే అడ్వాంటేజ్‌గా తన అనుచరులందరికీ టిక్కెట్లు ఇచ్చేసుకున్నారు. అంతే కాదు.. ప్రచారం కూడా అంతా తన చుట్టే తిరిగేలా చేసుకుంటున్నారు.
ఏకంగా ఖమ్మం ప్రజలంతా తనను చూసి ఓటేయాలని పిలుపునిస్తున్నారు. అజయ్ దూకుడు చూసి.. టీఆర్ఎస్లోని ఇతర నేతలు మండి పడుతున్నారు. తనను చూసి ఓట్లేయమని అడగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్లో ఎవరైనా కేసీఆర్‌ను చూపించి ఓట్లు అడగాలని.. కేసీఆర్ కంటే.. పెద్ద నేతగా అజయ్ ఎదిగిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం టీఆర్ఎస్లో గ్రూపులు చాలా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నామా నాగేశ్వరరావు ప్రధాన నేతలుగా ఉన్నారు. వీరంతా బలమైన వర్గాలను మెయిన్‌టెయిన్ చేస్తున్నారు.
అయితే అనూహ్యంగా ప్రభుత్వంలో ప్రాధాన్యం మాత్రం.. అజయ్‌కు ఉంది. అందుకే ఈ ముగ్గురు నేతలు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ కారణంగా తరచూ వారిపై పార్టీ మార్పు రూమర్స్ వస్తున్నాయి. ఇలా రూమర్స్ వచ్చినప్పుడల్లా కేటీఆర్ కల్పించుకుని ఆయన నేతలతో మాట్లాడుతున్నారు. వారు కూల్ అవుతున్నారు. ఇప్పుడు అజయ్.. ఆ ముగ్గురు నేతలకు కార్పొరేషన్ ఎన్నికల పేరుతో మరింత బీపీ పెంచుతున్నారు. అందుకే ఖమ్మం టీఆర్ఎస్లో ఏ క్షణమైనా అగ్నిపర్వతం బద్దలవుతుందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.