పాతుకు పోతున్న నాయకుల్ని వారి కుటుంబాల వారసత్వాలకు మూలాలైన సామాజిక, రాజకీయ మూలాల్ని పునాదుల నుంచీ కనీసం ముప్పై ఏళ్ళకు ఓక సారి కదలించవచ్చునని నియోజకవర్గాల పునర్వ్యవస్ధీకరణ చట్టం ద్వారా రాజ్యాంగమే సూచిస్తోంది. బలహీనులకు కూడా రాజకీయ అవకాశాలు ఇవ్వాలన్నదే ఈ చట్టం స్ఫూర్తి! అయితే, ఇదొక తేనెతుట్టలాంటి వ్యవహారం కనుక దీన్ని కదిలించే సాహసానికి తప్పని సరైతే తప్ప పాలకపార్టీలు పూనుకోవడం లేదు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకూ కరణాలు, మున్సబ్ లు, పటేల్, పట్వారీల వ్యవస్ధను తొలగించి, తాలూకాలను రద్దుచేసి మండల వ్యవస్ధను రూపొందించిన ఎన్ టి ఆర్ కారణంగా పరిపాలన ప్రజలకు బాగా దగ్గరగా వచ్చింది. దీని ఫలితంగా ప్రతి ప్రాంతంలోనూ బిసి వర్గాల వారు, అధికార ప్రాబల్యాలకు దగ్గరయ్యారు.
ఇపుడు తెలంగాణాలోని 10 జిల్లాలను 31 జిల్లాలకు కెసిఆర్ విభజించడంలో కూడా ప్రయోజనాలు అలాంటివే! సామాజికంగా, ఆర్ధికంగా, ఆర్ధికంగా పాతుకుపోయి వున్న నాయకులు ప్రాతినిధ్యం వహించే ఒకో నియోజకవర్గం రెండు లేదా మూడు జిల్లాల్లోకి చేరిపోయాయి. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి నియోజక వర్గాల్లో కుల, రాజకీయ, ఆర్ధిక సమీకరణలు మారిపోక తప్పదు. చాలా చోట్ల పాతుకుపోయిన నాయకుల స్ధానంలో కొత్త నాయకత్వాలకు అవకాశాలు లభించక తప్పదు.
స్ధానికంగా పాతుకుపోయిన రాజకీయ నాయకుల స్ధానంలో కొత్తవారిని తీసుకు వచ్చిన కీర్తి ప్రతిష్టలు కెసిఆర్ కే దక్కక తప్పదు. ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ కు భవిష్యత్తులో కొత్త సమీకరణల ద్వారా రాజకీయబలం పెంచుకోవడానికి జిల్లాల విభజన విశేషంగా దోహదపడుతుంది.
అంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, అభివృద్ధి మీదే దృష్టిపెట్టి వున్న చంద్రబాబు ఎజెండాలో జిల్లల పునర్విభజన లేదు. ఉన్న పరిస్ధితులనే సానుకూలంగా వినియోగించుకోవడం ఆయన నైజం. కొత్త ప్రయోగాలు చేయడం ఆయన స్వభావంకాదు. అదీగాక విభజన ద్వారా ప్రాంతాల హద్దుల్ని మారిస్తే ఇపుడున్న ఒక సామాజిక బ్యాలెన్సులో మార్పు వస్తుంది. అది ”కాక మీద వున్న కాపులకు” ఉపయోగపడితే తెలుగుదేశం పాలిట రాజకీయ ఆత్మహత్య కూడా కావచ్చు.
అందుకే ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు సమీప భవిష్యత్తులో అవకాశంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ మండలంలో పాతుకుపోయి వున్న తెలుగు దేశం స్ధానిక నాయకులెవరూ ”హద్దులు మార్చాలని” కోరే అవకాశం కూడా లేదు.