యూట్యూబ్ చానళ్లలో తిడుతున్న వారి తిట్లను చూసి రేవంత్ రెడ్డి చావాల్సింది కానీ బతికున్నాడని కేటీఆర్ వెటకారంగా చెబుతున్నారు. సిగ్గులేదు కాబట్టే బతుకుతున్నాడని కేటీఆర్ అంటున్నారు. ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్న వారికి బీఆర్ఎస్ సపోర్టర్లు గతంలో రేవంత్ కేసీఆర్ ను చచ్చిపోవాలని సలహా ఇచ్చినప్పుడు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. నిజమే ఒకర్ని చచ్చిపోవాలని చెప్పినప్పుడు తప్పు .. మరొకరు అదే మాట అన్నప్పుడు ఒప్పు కాదు. ఎవరు అన్నా తప్పే. ఎవర్నీ సమర్థించరు. ప్రజలు కూడా హర్షించరు.
వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు జరిగిన రాజకీయాలను చూసి అయినా తెలంగాణ నేతలు నేర్చుకుంటారేమో అనుకున్నారు కానీ పూర్తిగా రివర్స్ అయింది. ఏపీలో ఇప్పుడు ఎవరూ ఒక్క బూతు మాట మాట్లాడటం లేదు. రాజకీయ విమర్శలు.. రాజకీయ విమర్శలుగా చేసుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం చావుల గురించి మాట్లాడేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ఇంత ఘోరమైన మాటలు మాట్లాడటం వల్ల విపక్షాలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?. రేవంత్ రెడ్డి ఆలంటి భాష మాట్లాడి ఉంటే ఎవరికి నష్టం?. ప్రజలు వినోదంగా చూస్తారా?. ఖచ్చితంగా రేపు తీర్పు చెబుతారు. కానీ దొందూ దొందే అనేలా బీఆర్ఎస్ నేతలు ప్రజల ముందు ప్రవర్తిస్తే వారు ఎవరికి ఓటేస్తారు?. ఇద్దరూ ఒకటే అనుకునేలా చేయడమే బీఆర్ఎస్ కు మొదటి పరాజయం.
అధికారంలో ఉన్నవారు కంట్రోల్ తప్పితే శిక్షించడానికి ప్రజలు రెడీగా ఉంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కంట్రోల్ తప్పితే ప్రజలు అసలు వారి గురించి మర్చిపోతారు. ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతి విషయంలో తెలుసుకోలేరు. వారి మనోభావాలను ఎప్పటికప్పుడు గుర్తించి రాజకీయం చేయాలి. వ్యక్తిగత ఈగోలకు పోతే.. అది ప్రజల ముందు తప్పుడు కారణాలతో నిలబెడుతుంది. ఏపీలో జరిగింది అదే. వైసీపీ అడ్రస్ లేకుండా పోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఆ పార్టీ నేతల భాష కూడా.