ప్రతిపక్షణం ఉత్కంఠ భరితం అన్నట్టుగా సాగుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఇంకా సస్పెన్స్‌గానే. మొత్తం వ్యవహారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందుకే, ఈ కాలయాపన. అయితే, గడచిన రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించుకుంటే… తమిళనాడు వ్యవహారాలపై భాజపా గందరగోళ పడుతున్నట్టుగా ఉంది! పన్నీర్ సెల్వమ్ మీద మోడీకి ఇంకా పూర్తిస్థాయి నమ్మకం కుదిరినట్టు లేదు. ఏ అడుగు వేస్తే ఎటువైపు పడుతుందో, ఎలాంటి పరిణామాలకు దారితీస్సతుందో అనే టెన్షన్ భాజపాలో ఎక్కువౌతోందని చెప్పొచ్చు.
ఈ ఉత్కంఠను ఓ నాలుగు రోజులు పొడిగిస్తే… కావాల్సిన ఎమ్మెల్యేలను పన్నీర్ సమకూర్చుకుంటారని భాజపా ఆశించింది. కానీ, అనుకున్నట్టుగా అనూహ్య స్థాయిలో పన్నీర్ వైపు వస్తున్నవారు పెద్దగా కనిపించడం లేదు. అందుకే, సెల్వాన్ని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమంటూ ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. పోనీ.. సెల్వానికి కేంద్రం మద్దతు లభిస్తోందని కాస్త ఓపెన్‌గా చెప్పినా… శశికళ వెంట ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారన్న గ్యారంటీ కూడా కనిపించడం లేదు! పన్నీర్‌కు అవకాశం ఇచ్చినా.. బల నిరూపణలో ఫెయిల్ అయితే మొదటికే మోసం తప్పదు.
ఇంకోపక్క, డీఎంకే కూడా అధికారం కోసం పావులు కదుపుతోందన్న వార్తలూ వస్తున్నాయి. భాజపాకి డీఎంకే అంటే అస్సలు పడదు కదా! ఎందుకంటే, ఆ పార్టీ ఎప్పుడూ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటూ వస్తోంది. దీంతో అటువైపు మద్దతు పెరగకుండా చూసుకోవడం కూడా భాజపాకి కొత్త టాస్క్ అయిపోయింది. పోనీ… ధైర్యం చేసి శశికళకు మద్దతు ఇచ్చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేయిద్దామంటే… రేప్పొద్దున్న ఆమె కొరకరాని కొయ్యగా మారే ఛాన్స్ ఉంది. భాజపా ఆడించినట్టల్లా ఆమె ఆడుతుందన్న నమ్మకం మోడీకి లేదు. ఇంకోపక్క, ఆమెపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలీదు!
రాజకీయంగా శశికళ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే.. అది రాజ్యాంగ విరుద్ధమైతే రాష్ట్రపతి ఊరుకునే పరిస్థితి ఉండదు! ఎందుకంటే, ప్రణబ్ ముఖర్జీ గతంలో కాంగ్రెస్ నాయకుడు అనే విషయాన్ని మనం మరచిపోకూడదు. ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రపతి హోదాలో ఆయన ఎలా స్పందిస్తారన్నది మరో సమస్య. మొత్తానికి, అంతా తమ అధీనంలో ఉంటుందని భాజపా అనుకుంది. వాస్తవంలో మాత్రం అడుగు తీసి అడుగు వెయ్యలేని సందిగ్ధంలో కేంద్రం పడ్డట్టుంది. మరి, ఈ చిక్కుముళ్లు విడటం ఎక్కడి నుంచి మొదలౌతుందో వేచి చూడాలి.