రాజకీయాల్లో ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ పోలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదే ఓ మహిళ కారణంగా అధికారంలో ఉన్న వారు కలవరపడడం. అక్కడ సాధన.. ఇక్కడ లక్ష్మీ పార్వతి. ములాయం సింగ్ యాదవ్‌కు సాధన రెండో భార్య. ఈమె ఆయనకు దగ్గర కావడంలో అమర్ సింగ్ ప్రముఖ పాత్ర పోషించారు. అధికారం కోసం ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆమెకు శివపాల్ యాదవ్ తోడయ్యాడు. పార్టీపై పట్టు సాధించేందుకు ఆమెతో కలిశాడు. అఖిలేశ్‌కు చెక్‌పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సామాన్య కార్యకర్తయిన సాధన 1980లో ములాయం సింగ్‌కు దగ్గరయ్యారు. వారిద్దరికీ ఓ కుమారుడు ప్రతీక్. అధికారం కోసం ఇక్కడే ఆరాటం మొదలయ్యింది. చిత్రమేమిటంటే సాధన కోరుతున్న మాదిరిగా ప్రతీక్ ఎన్నికల్లో పోటీకి అంగీకరించలేదు. ఆమె కుమార్తె ఇందుకు సిద్ధమవుతోంది. ఒక్కటి మాత్రం స్పష్టం. శివపాల్, సాధన ఇద్దరికీ అఖిలేశ్ పొడ గిట్టడం లేదనేది రూఢీ అయిపోయింది. ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో రేగిన రగడ యావద్దేశాన్నీ ముఖ్యంగా బీఎస్పీని ఆపై బిజేపీని విశేషంగా ఆకర్షిస్తోంది.
మరో వంక ఒక రెండు దశాబ్దాలు వెనక్కి వెడితే, సంయుక్త ఆంధ్ర ప్రదేశ్‌లోనూ మహిళ కారణంగానే టీడీపీ చీలిపోయింది. శ్రీమతి లక్ష్మీ పార్వతి 1994 ప్రాంతంలో ఎంతటి ప్రాధాన్యతను పోషించారో అందరికీ తెలుసు. శ్రీమతి బసవతారకం కన్నుమూసిన తరవాత, ఎన్టీరామారావు సరసన చేరిన శ్రీమతి లక్ష్మీపార్వతి పొడగిట్టక టీడీపీలోని సభ్యులలో కలకలం రేగింది. శ్రీమతి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌కు సన్నిహితం కావడానికి సినీ నటుడు మోహన్‌బాబు కారణమంటారు. సహజంగానే ఆమె అధికారం చెలాయించడాన్ని ప్రారంభించారు. ఆపై నడిచిన కథ ఆ రోజుల్లో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రముఖ దిన పత్రిక కూడా రామారావును గద్దె దింపడంలో చురుగ్గా వ్యవహరించిన విషయాన్ని ఎవరూ మరువలేరు. ఆ విశేషాలు తెలుసున్న వారిని యూపీలోని ప్రస్తుత పరిణామాలు ఆకర్షిస్తన్నాయి. ఆడవారి కారణంగా అధికారం చేతులు మారింది ఏపీలో. యూపీ కూడా అదే దారిలో నడుస్తున్నంట్లుంది. అన్నట్లు సమాజ్‌వాదీ, తెలుగు దేశం పార్టీ ఎన్నికల గుర్తు కూడా సైకిల్ కావడం యాదృచ్ఛికమే.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి