ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయానికి ఏదీ అనర్హం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై రివ్యూలు కూడా రాజకీయ నేతలు చేసేస్తున్నారు. ఓ వైపు సినిమా టిక్కెట్ల విషయంలో లేనిపోని రాజకీయం చేసి.. ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం.. ప్రభుత్వం వైపు నుంచే జరగింది. అర్థరాత్రిళ్లు కూడా ప్రభుత్వాన్ని పని చేయించి.. జీవోలు విడుదల చేయించి.. ఉదయమే టిక్కెట్లు కొన్న వారికి అధికారులు దగ్గరుండి డబ్బులు వెనక్కి ఇప్పించారు. ఇలాంటి పరిస్థితులు ఓ వైపు ఉండగా.. మరో వైపు వైసీపీ నేతలు… వకీల్ సాబ్ సినిమాను చూడకుండానే రివ్యూలు పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఆంధ్ర ప్రభుత్వం డిజిటల్ డైరక్టర్‌గా ప్రజల పన్నుల సొమ్మును జీతంగా తీసుకుంటూ.. వైసీపీ సోషల్ మీడియా హెడ్‌గా పని చేసే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర్నుంచి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వరకూ అందరూ నకీల్ సాబ్ సినిమా బాగో లేదని చెప్పడం ప్రారంభించారు. వారెవరూ సినిమాను చూడలేదు.
అయినా… ఇష్టం వచ్చినట్లుగా రివ్యూలు ఇచ్చేశారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా వెనక్కి తగ్గలేదు. పవన్ కల్యాణ్‌కు మద్దతిస్తున్నట్లుగా చెప్పుకోవడానికి.. వైసీపీ పై విమర్శలు చేయడానికి వకీల్ సాబ్‌ను ఎంచుకున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే వాళ్లు వకీల్ సాబ్ ను చూసి భయపడుతున్నారని.. ప్రజాదరణను చూసి భయపడే… బెనిఫిట్ షోలు రద్దు చేశారని..బీజేపీ నేత సునీల్ దేవధర్ ఆరోపించారు. పవన్ కే కాదు.. పవన్ సినిమాను చూసి కూడా.. జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వకీల్ సాబ్ సినిమాపై ఎప్పుడూ లేనంత రాజకీయం పడింది.
ఓ వైపు ఆ సినిమాను ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రలు … ప్రభుత్వం అధికార పార్టీ వైపు నుంచే జరగగా… ఆరంభం నుంచే సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు ఆ పార్టీ సోషల్ మీడియా.. కార్యకర్తలు విపరీతంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. రాజకీయం.. వ్యాపారం వేర్వేరు. రాజకీయంగా వ్యతిరేకులైతే.. వ్యాపారాలను దెబ్బతీస్తే.. అలా నష్టపోయేది ఆ వ్యాపారి ఒక్కరే కాదు.. రాష్ట్రం కూడా . ఈ విషయాన్ని అంచనా వేయలేక.. ప్రభుత్వం…అధికార పార్టీ దారుణమైన విధ్వంసకర వ్యూహంతో ముందుకెళ్తున్నారు.