ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి అనుమతుల్ని టీడీపీ ప్రభుత్వమే ఇచ్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. బాధితులకు పరిహారం ఆన్ లైన్లో విడుదల చేసే కార్యక్రమంలో పేర్కొన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. మొత్తం వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వమే దోషి అంటూ..పత్రాలతో సహా.. వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. మొత్తం ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అనుమతుల చిట్టాను బయట పెట్టారు…
ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ గా ఉన్న సంస్థకు 1964లో అప్పటి ప్రభుత్వం 219 ఎకరాలు భూమి కేటాయించింది, ఆ తర్వాత 1992లో ఆనాటి ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ నుంచి మినహాయింపు కూడా ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించలేదు. 2007లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లియరెన్స్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది, మళ్లీ 2009లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పొల్యూషన్ క్లియరెన్స్ ను మరోసారి ఇచ్చింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2012లో కూడా క్లియరెన్స్ ఇచ్చింది. వీటిని సంబంధించిన పత్రాలను లేఖతో పాటు చంద్రబాబు విడుదల చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లను చంద్రబాబు ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. పాలిస్టెరీన్, ఎక్స్ పాండబుల్ పాలిస్టెరీన్ ఉత్పత్తి చేస్తామని పెట్టుకున్న దరఖాస్తులను టీడీపీ సర్కార్ తిరస్కరించింది.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎల్జీ పాలిమర్స్‌కు మంచి రోజులు వచ్చాయి. 2019 జూన్ 20 నుంచి 23 వరకు విజయవాడలో స్టేట్ ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా పరిశ్రమలకు కొత్తగా ఇచ్చే అనుమతులు, సిఫార్సుల కోసం జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ.. పాలిస్టెరీన్, ఎక్స్ పాండబుల్ పాలిస్టెరీన్ ఉత్పత్తుల విస్తరణ అంశాన్ని ఈ సమావేశం ఎజెండాలో చేర్చారు. ఎల్జీ పాలిమర్స్ అప్లికేషన్ ను క్లియర్ చేసి స్టేట్ లెవల్ ఎన్విరాన్ మెంట్ బోర్డ్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటీకి పంపించారు. స్టెరీన్ విస్తరణకు అనుమతిని టీడీపీ ప్రభుత్వం నిరాకరించిందని, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఇచ్చిన అఫిడవిట్ లోనే పేర్కొంది. స్టెరీస్ ఉత్పత్తుల విస్తరణకు 2019 జులై 9న కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం సిఫారసు చేసింది. అథారిటీకి ఏపీ సర్కార్ పంపిన సిఫారుసు లేఖను కూడా చంద్రబాబు విడుదల చేశారు.ఈ కంపెనీకి ఎప్పుడెప్పుడు ఏఏ ప్రభుత్వాలు ఎటువంటి అనుమతిలిచ్చాయో తమ వద్ద వివరాలున్నాయని, వీటిపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు. మరి వైసీపీ స్పందిస్తుందో లేదో..?