నిజం! ఇది అక్షరాల నిజం. మనుషుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు పులుల మధ్యన ఉంచారు. రాజకీయ సంక్ష్భంలో చిక్కుకొన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరుగుతోందిపుడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరీష్ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వంపై తిరుగుబాటుకి భాజపా ప్రోత్సహించింది. వారు భాజపా ఎమ్మెల్యేలతో గవర్నర్ కృష్ణ కాంత్ పాల్ ని కలిసి ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్లు లేఖ ఇచ్చేరు. ఆయన వెంటనే దానిపై స్పందిస్తూ మార్చి 28న శాసనసభలో బలం నిరూపించుకోవలసిందిగా ముఖ్యమంత్రి హరీష్ రావత్ ని కోరారు. ఈలోగా మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను రావత్ ప్రభుత్వంపై తిరుగుబాటుకి భాజపా ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 36మంది సభ్యులు ఉండగా వారిలో 9 మంది చెయ్యి జారిపోయారు. మిగిలినవారిలో మంత్రులు హరీష్ రావత్ వెంటే ఉన్నారు. కానీ 19 మంది ఎమ్మెల్యేలు మాత్రం భాజపా ప్రభావానికి, ఒత్తిడికి గురయ్యేట్లు గమనించడంతో వారందరినీ నైనిటాల్ జిల్లాలో గల జిమ్ కార్బెట్ అనే జాతీయ పులుల అభయారణ్యంలోకి హెలికాఫ్టర్ ద్వారా తరలించేరు. అక్కడికి చేరుకొనేందుకు రోడ్డు మార్గం కూడా లేనందున భాజపా నేతలు అక్కడికి వచ్చేందుకు సాహసించకపోవచ్చని హరీష్ రావత్ భావిస్తున్నారు.
ఉత్తరాఖండ్ శాసనసభలో మొత్తం 70మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీ-36, భాజపా-28, బి.ఎస్.పి.-2, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్-1, స్వతంత్రులు-3 సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని 9మంది సభ్యులు మద్దతు ఉపసంహరించుకోవడంతో హరీష్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఒక్క భాజపా తప్ప మిగిలిన పార్టీల సభ్యులందరూ హరీష్ రావత్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కానీ తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు మద్దతు ఉపసంహరించుకొని, భాజపాకి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించేరు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా తక్షణమే శాసనసభలో బల ప్రదర్శన నిర్వహించాలని భాజపా గవర్నర్ ని ఒత్తిడి చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగానే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిందని, కనుక తమకు అవకాశం కల్పిస్తే సుస్థిరమయిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భాజపా వాదిస్తోంది.