ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత చకచకా పనులు చేసేస్తారనే అభిప్రాయమే కలిగింది. కొత్త పథకాల వెల్లడి, కొత్త నిర్ణయాల హడావుడితో ఆయన పాలన ప్రారంభమైంది. అయితే, ఇప్పుడీ ఇసుక కొరత మొదలుకొని ఒక్కో అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పోతే… పాలనాపరమైన నిర్ణయాల్లో జగన్ సర్కారు వెనకబాటుతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, అవసరమైన నిర్ణయాలను అవసరమైన సమయంలో తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఇసుక సమస్యే తీసుకుంటే… కేవలం ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేకపోవడం వల్లనే కొరత వచ్చింది. అధికారంలోకి రాగానే గత టీడీపీ విధానాన్ని రద్దు చేసి, గడచిన సెప్టెంబర్ వరకూ కొత్త విధానం అమల్లోకి తేలేదు. ఈలోగా ఇసుక కొరత పెరిగిపోయింది. భవన నిర్మాణ కార్మికులతోపాటు దీనికి అనుబంధంగా ఉన్న ఇతర రంగాలపై కూడా ప్రభావం పడింది. అస్పష్ట విధానాలకు ఇదో ఉదాహరణ.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల అంశం చూస్తే… వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ఒక్క అంగుళం ముందుకు సాగడం లేదు. అవినీతి వెలికి తీస్తామనీ, రివర్స్ టెండరింగ్ పేరుతో పనులన్నీ ఆగిపోయాయి. ఎప్పుడు మొదలౌతాయో స్పష్టత లేదు. రాజధాని నిర్మాణం పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అక్కడ నిర్మాణాలన్నీ టీడీపీ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించిందో అక్కడే ఉన్నాయి. దీనికి తోడు రాజధాని అక్కడే ఉంటుందా ఉండదా అనే సందిగ్ధతను ఇంకా జగన్ సర్కారు కొనసాగిస్తోంది. ఇవే కాదు… ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల నిర్మాణ పనులూ ఆగిపోయాయి. ఆర్ అండ్ బి, పీడబ్ల్యూడీ, పంచాయతీరాజ్… అన్ని పనులూ ముందుకు సాగడం లేదు. దీనికి ప్రాథమికంగా కనిపిస్తున్న కారణమైతే నిధులు సర్దుబాటు కాకపోవడం అనే చెప్పొచ్చు.
అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ కేవలం సంక్షేమ పథకాలపై మాత్రమే జగన్ సర్కారు దృష్టి పెడుతోంది. అంటే, నగదు రూపంలో ప్రజలకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశమే ప్రముఖంగా ఉంది. దీన్నెవ్వరూ తప్పబట్టరు. అయితే, దీంతో పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ పనులన్నీ ఆగిపోయాయి. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రధానమైన కారణం రాజకీయ నిర్ణయాల్లో ఉన్న మాంధ్యమే అనొచ్చు. విధానాల్లో గందరగోళమే ఈ పరిస్థితి కారణం. సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, ఇతర రంగాల ద్వారా కూడా ప్రజలకు మేలు చెయ్యొచ్చు, జరగాల్సింది కూడా అదే. ఇసుక లభ్యత సరిగా ఉండి ఉంటే… ఇవాళ్ల దాదాపు 20 లక్షమందికి ఉపాధి కోల్పోయిన పరిస్థితి వచ్చేది కాదు. టీడీపీ సర్కారు చేసినవి మేమెందుకు కొనసాగించాలనే పట్టుదలతోనే చాలా పనులు ఆపేసిన పరిస్థితి ఉంది. ఇది సరైన కారణం ఎలా అవుతుంది..? విధానపరమైన నిర్ణయాల్లో ఇలాంటి ధోరణుల వల్లే కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని పనులు ఆగిపోయాయి. ఓపక్క, దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులున్నాయి, రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది. వీటిని అర్థం చేసుకుని… అన్ని రంగాల మధ్య సమతౌల్యత పాటించే విధానాలను రూపొందించే దిశగా జగన్ సర్కారు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు… ఇది టీడీపీకి చెంపపెట్టు కావాలనో, ఆ పార్టీ నాయకుల్ని ఇరకారటంలో పెట్టాలనే ఆలోచనా ధోరణి ప్రోద్బలం కాకూడదు.