తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి భారతీయ జనతా పార్టీలో సందడి లేదు. వర్గ పోరాటం కారణంగానే తీవ్రంగా నష్టపోయిన ఆ పార్టీకి… ఫలితాల తర్వాత కూడా సమస్యలు వస్తున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇటీవల బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ సారథిగా కొనసాగిఉంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకొచ్చింది.
మరోవైపు బండి సంజయ్ అనుచరులకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటల రాజేందర్ అనుచరులు. తన అనుచరులంటూ టికెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్ గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు. చివరకు తన పార్లమెంట్ పరిధిలోకూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని సోషల్ మీడియాలో ఈటల అనుచరులు ఫుల్ ఫైర్ అయ్యారు. ఇవి శృతి మించి పోతూండటంతో.. ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పేరుతో..తన అనుచరుల పేరుతో పెడుతున్న పోస్టులన్నీ ఫేక్ అని ప్రకటించారు.
ఈ సోషల్ మీడియా వార్ బండి, ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని సైతం వదలడం లేదు. పార్టీ ఓటమికి కారణం ఆయనేనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. బండి సంజయ్‌కు మళ్లీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం తాము టిక్కెట్లు ఇప్పించుకున్న వారు ఓడిపోవడమే. కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలో బీజేపీని గెలిపింలేకపోయారు.
పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో మూడు నెలల్లోనే ఉన్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో… కొంత మంది సీనియర్లు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది.