పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహాల్లో దిట్ట. ఆయన సేవలు బీజేపీ నుంచి వైసీపీ వరకూ అందరూ ఉపయోగించున్నారు. ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు కూడా. కానీ ఆయనకు మాత్రం.. రాజకీయం చేత కావడం లేదు. బీహార్ రాజకీయ వారసుడు అయిపోదామని.. జేడీయూలో చేరిపోయిన ఆయన.. ఇప్పుడు.. ఆ పార్టీలో ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. ఉంటే ఉండు .. పోతే పో.. అని జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి … వార్నింగ్‌లు అందుకుంటున్నాడు. దీనికి కారణం.. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వంటి అంశాల్లో.. మోడీ సర్కార్‌పై.. అమిత్ షాపై.. పీకే.. ఏకపక్షంగా విమర్శలు చేయడమే. ఆయన విమర్శలతో తనకేమీ సంబంధం లేదని.. నితీష్ నిరూపించుకోవడానికి.. పీకేని వదిలించుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.
ఒకప్పుడు.. జేడీయూ – ఆర్జేడీ మధ్య పొత్తు పెట్టి.. సంచలన విజయం దక్కేలా చేసిన ఆయనపై.. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు మంచి గురి ఉంది. సహజంగా రాజకీయాల్లో వారసత్వాలను ఇష్టపడని నితీష్ కుమార్.. తన కుటుంబసభ్యులకు జేడీయూలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ.. ప్రశాంత్ కిషోర్‌ను మాత్రం… పార్టీలోకి తీసుకుని.. వైస్ ప్రెసిటెండ్‌గా పదవి ఇచ్చి.. తన తర్వాత ఇక ప్రశాంత్ కిషోరో అని పార్టీ శ్రేణులుకు సందేశం పంపారు. అయితే.. ఇప్పుడు.. పీకేతో అంత అవసరం లేదని అనుకున్నారో.. ఆయన రాజకీయ వ్యూహాలు ముంచేస్తాయని భావించారో కానీ వద్దనుకుంటున్నారు. అమిత్ షా కూడా వ్యూహాత్మకంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమారే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ముందుగానే ప్రకటించేస్తున్నారు. ఈ కారణంగా.. పీకే అవసరం.. నితీష్‌కు లేకుండా పోయినట్లయింది.
ప్రశాంత్ కిషోర్ .. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేసి.. తెలుగుదేశం పార్టీపై.. సోషల్ మీడియా ప్రచారం ద్వారా కుల ముద్ర వేసి.. మిగతా అన్ని కులాలను రెచ్చగొట్టడంలో ఆయన చాలా అతి తెలివి ప్రణాళికలు వేశారని.. ఆ కారణంగానే టీడీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు అంటూంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలతోనే .. పీకే వ్యూహాలు నడుస్తాయన్న విషయం అందరికీ క్లారిటీ ఉంది. కానీ అది ఎల్ల కాలం పని చేయదని.. బీహార్ సీఎంకు తెలిసిపోయినట్లుగా ఉంది. ఇంక అవసరం లేదని గెంటివేతకు సిద్ధమయ్యారన్న చర్చ నడుస్తోంది.