ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ వాటి మధ్య ఉన్న ‘రాజకీయ లింకు’ని మాత్రం ఎవరూ తెంచలేకపోతున్నారు. తెలంగాణా నుండి తెదేపాను తుడిచిపెట్టేసినట్లయితే ఆ లింక్ తెగిపోతుందని అనుకొన్నప్పటికీ, ఆంధ్రాలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా తెలంగాణా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలని, పార్టీ నేతలని పెద్ద ఎత్తున తెరాసలోకి తీసుకుపోతుంటే తెదేపా నేతలు తెరాస అధినేత కేసీఆర్ పై ఆయన పార్టీ అమలుచేస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేసేవారు.
తెలంగాణా తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీత దయాకర్ రెడ్డి, కె. దయాకర్ రెడ్డి తదితరులు ఈరోజు రామన్ పాడు, జూరాల ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో ప్రతిపక్షాలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను నయాన్నో భయాన్నో లొంగదీసుకొని ఇప్పుడు తెరాసలోకి తీసుకుపోయినా, ఎన్నికల సమయానికి మళ్ళీ వారందరూ తెదేపాలోకే తిరిగివచ్చేయడం ఖాయమని అన్నారు.
తెలంగాణాలో తెరాస చేస్తున్న పనినే ఆంధ్రాలో తెదేపా చేస్తోంది. కనుక వారు చెపుతున్న మాటలను ఆంద్రాలో తెదేపాకి కూడా అన్వయించి చూసుకోవచ్చును. ఒకవేళ ఆంధ్రాలో తెదేపా చేస్తున్నదీ తప్పు కాదని తెలంగాణా తెదేపా నేతలు అనుకొంటున్నట్లయితే, అప్పుడు తెరాస చేస్తున్నది తప్పు కాదనే సర్దిచెప్పుకోవలసి ఉంటుంది. లేదా మౌనం వహించాల్సి ఉంటుంది. లేకుంటే తెరాస నుండి వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవడం కష్టం. తెలంగాణాలో తెరాసను నిందిస్తున్న తెదేపా ఆంధ్రాలో అదే తప్పు చేస్తోంది కనక ఇప్పుడు వైకాపా ప్రశ్నలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది.
రెండు పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి కనుక వాటిని నిందించడానికి ఇతర పార్టీలకి అవకాశం కల్పించినట్లయింది. ప్రజల దృష్టిలో కూడా చాలా చులకన అవుతున్నాయి. స్వంత పార్టీల నేతల, కార్యకర్తల బలంతో పార్టీ నిర్మించుకోవలసిన ఆ రెండు పార్టీలు, అవసరం లేకపోయినా బయట నుండి వచ్చిన అవకాశవాద రాజకీయ నేతలతో పార్టీని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ బలహీనమయిన పునాదుల మీద నిర్మించుకొంటున్న పార్టీ కోటలు ఎన్నికల సమయంలో చిన్న దెబ్బ తగిలిన కుప్పకూలిపోవచ్చును. కానీ ప్రస్తుతానికి వాపును చూసి బలుపు అని ఆనందపడటంలోనే వాటికి హాయిగా ఉంది కనుక వలసలను ప్రోత్సహిస్తున్నాయి.