హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత మూడో రోజు అంటే చిన్న కర్మ రోజు.. బాలకృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఓ సీక్రెట్ వీడియో బయటకు వచ్చింది. అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. కుటుంబసభ్యులంతా మాట్లాడుకుంటే.. దానికి అంత విశేషం ఎందుకు అని అందరికీ అనిపించొచ్చు కానీ… తెర వెనుక రాజకీయాలపై అప్పటి వరకూ ఉన్న గాసిప్స్… ఆ వీడియో వైరల్ అవడానికి కారణం అయింది. వాస్తవానికి ఆ కుటుంబంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు…కానీ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. చాలా కాలంగా ఒకే వేదికపై కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే.. కుటుంబ ఫంక్షన్లలోనూ కలిసింది లేదు. బాలకృష్ణే అలా ఉన్నారు కాబట్టి.. ఇక లోకేష్, చంద్రబాబు వేరేగా ఉండే అవకాశం లేదు. దాంతో… ఆ సెపరేషన్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంది.
అయితే ఓ విషాదం మళ్లీ వారిని కలిపిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు.. అరవింద సమేత సినిమా సక్సెస్మీట్కు నందమూరి బాలకృష్ణ.. జూ.ఎన్టీఆర్.. కల్యాణ్ రామ్ హాజరవబోతున్నారు. శిల్పకళా వేదికగా జరిగే కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ విషయం బయటకు తెలియగానే నందమూరి అభిమానుల్లో ఓ రకమైన ఆనందం కనిపించింది. గతంలో బాలకృష్ణ నటించిన “సింహా” సినిమాకు సంబంధించిన కార్యక్రమానికి ఎన్టీఆర్ రావడమే లాస్ట్. మళ్లీ ఇప్పుడు కలసి కనిపించబోతున్నారు.
ఇప్పుడీ కలయిక రాజకీయవర్గాల్లోనూ వైరల్ అవుతోంది. గతం గతహా అనుకుని.. జూనియర్ ఎన్టీఆర్‌ను.. మళ్లీ దగ్గరకు తీసుకునే అవకాశాలను ఎవరూ కొట్టి పారేయడం లేదు. అలా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పొలిట్ బ్యూరో సభ్యుడిగా నందమూరి కృష్ణ ఉండేవారు. ఆయన కుటుంబం నుంచి… ఒకరికి పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వేలు పెట్టకపోవచ్చన్న అభిప్రాయం కూడా.. టీడీపీ వర్గాల్లో ఉంది. పిలిస్తే ప్రచారం చేయడం వరకూ.. చేసి.. రాజకీయ పదవుల విషయంలో… మాత్రం దూరంగా ఉంటారని చెబుతున్నారు. ఏం జరిగినా… ఎన్టీఆర్ కుటుంబం విషయంలోనే కాదు… టీడీపీ రాజకీయ వ్యవహారాలలోనూ.. నేటి అరవింత సమేత వేడుక.. ఓ పెద్ద మైల్‌స్టోన్‌గా మారే అవకాశమే కనిపిస్తోంది.