సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. సినిమాల్లో ఓ హీరోని అభిమానించే ప్రజలందరూ రాజకీయాల్లో అతడికి ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదు. పైపెచ్చు… రాజకీయాల్లోకి వచ్చిన హీరోలకు సినిమా పరంగా అభిమానులు తగ్గిన సందర్భాలు, కొంతమంది ప్రేక్షకుల్లో సదరు హీరోపై వ్యతిరేకత వ్యక్తమయిన సందర్భాలు వున్నాయి. రజనీకాంత్‌కి అటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని రజనీకాంత్ ప్రకటించిన తరవాత, థియేటర్లలోకి వస్తున్న ఆయన సినిమా ‘కాలా’. ఈ సినిమా అడ్వాన్స్ బుక్కింగ్స్పై పొలిటికల్ ఎఫెక్ట్ సుస్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా… తమిళనాడులో! తెలుగునాట రజనీకాంత్ గత సినిమాలు అంచనాలను తల్లకిందులు చేయడంతో హిట్ టాక్ వస్తే చూడమనే ధోరణి మెజారిటీ ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోంది. తమిళనాడులో రజనీకాంత్ హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి విపరీతమైన హైప్, క్రేజ్ వస్తాయి. ‘కాలా’కు అటువంటి హైప్, క్రేజ్ రాలేదు. అడ్వాన్స్ బుక్కింగ్స్ చూస్తే… ఇది రజని సినిమాయేనా? అన్న అనుమానం కలుగుతోంది. దీనంతటికీ కారణం రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశమే అంటున్నారు. సూపర్‌స్టార్ కూడా ఈ పరిణామాలను ముందుగా వూహించి అల్లుడు ధనుష్ నిర్మాణంలో సినిమాలు చేస్తున్నార్ట. బయట నిర్మాతలతో సినిమాలు చేసి, వాళ్ళు ఎక్కువ రేట్లకు సినిమాలను అమ్మితే… లేనిపోని గొడవలు వస్తాయని ఆలోచించార్ట.