పశ్చిమ బెంగాల్లో ఈసారైనా పాగా వేయాలని తహతహలాడుతున్న కమ్యూనిస్టుకు పరిస్థితి ఆశాజనకంగా ఉందా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. మమతా బెనర్జీ పాలనలో ఆశించిన ప్రగతి లేదంటూ అధికారంలోకి రావాలనేది లెఫ్ట్ కూటమి ఉద్దేశం. అయితే గతంలో 34 ఏళ్ల పాలనలో మీరేం చేశారనే ప్రశ్నకు అడుగుగునా జవాబు చెప్పడం కష్టంగా మారింది. ఆర్థికంగా, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ కామ్రేడ్లపై మమత విరుచుకుపడుతున్నారు. ఈమధ్యే కాస్త బలం పెంచుకున్న బీజేపీ కూడా ఇదే విమర్శ చేస్తోంది. లెఫ్ట్ పొత్తుతో వీలైనన్ని సీట్లు గెలవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ మాత్రం ఈసారి కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం లేదు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు, ఆర్థిక వేత్తలు, సద్ధాంత రీత్యా తమను సమర్థించే వారు కూడా గతంలోని లెఫ్ట్ పాలనను విమర్శంచడం కామ్రేడ్లకు మింగుడుపడటం లేదు. లెఫ్ట్ 34 ఏళ్ల పాలన బెంగాల్ ను ఆర్థికంగా, పారిశ్రామికంగా నాశనం చేసిందని తీవ్రంగా విమర్శించిన ప్రముఖ వ్యక్తి బీజేపీ లేదా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన వారు కాదు. రాజకీయంగా వామపక్షాలను సమర్థించే అమర్త్య సేన్. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థిక వేత్త అయిన ఆయన, గతంలో రాష్ట్రంలో లెఫ్ట్ కూటమి పనితీరును తూర్పార పడుతున్నారు. ఈమధ్యే అనేక సందర్భాల్లో తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. ఇవి వామపక్షాలకు ఇబ్బందికంగా మారాయి.
వామపక్షాల పాలనలో బెంగాల్ ఆర్థికంగా తిరోగమనం చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి దూరమయ్యాయని అన్నారు. ఒకప్పుడు పెద్ద పరిశ్రమల్లో భారీగా ఉత్పత్తి జరిగేది, వేల మందికి ఉపాధి లభించేది. దేశ విదేశాలకు ఎగుమతులు జరిగేవి. పారిశ్రామిక వేత్తల రాకపోకల కోసం కలకత్తా నుంచి లండన్ కు వారానికి 18 విమానాలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వారానికి ఒక్క డైరెక్ట్ విమానం కూడా లండన్ కే కాదు, ఏ యూరప్ నగరానికీ అందుబాటులో లేదు. పెద్ద పరిశ్రమలు లేకుండా పోయాయి. చిన్న చిన్న పరిశ్రమలు మాత్రమే మిగిలాయి. ఇదంతా 34 ఏళ్ల లెఫ్ట్ కూటమి పాలన వల్లే జరిగింది. అసలు వామపక్ష నేతల ఆలోచన ధోరణిలోనే తేడా ఉందేమో అని నాకు అనుమానం కలుగుతుందని ఆయన ఇటీవలే వ్యాఖ్యానించారు.
వామపక్షాల సమర్థకుడైన మేధావే ఇలా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కామ్రేడ్ల ప్రచారానికి పెద్ద ఆటంకం కావచ్చని భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలను రూడి చేస్తున్నట్టుగా ఈ అభిప్రాయాలు మీడియాలో వచ్చాయి. ఇవి పట్టణ మధ్య తరగతి ప్రజలను, యువతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తృణమూల్ బలంగా వేళ్లూనుకుందని మమత ధీమా. ఈ రకంగా చూసినప్పుడు కంచుకోటను తిరిగి దక్కించుకోవాలనే లెఫ్ట్ కల నిజమవుతుందా అనే అనుమానం కలుగుతుంది. వామపక్ష నేతలు మాత్రం మమత వైఫల్యాలే తమకు అధికారాన్నిస్తాయని భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. మరి మీరు కాంగ్రెస్ తో నేరుగా పొత్తుకే సై అన్నారు కదా అంటే జవాబు చెప్పడం కామ్రేడ్లకు కష్టంగా మారింది. ఈమధ్య కొన్ని ప్రాంతాల్లో బలం పెంచుకున్న బీజేపీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే అది కూడా లెఫ్ట్ కు మైనస్ పాయింట్ కావచ్చంటున్నారు పరిశీలకులు. మమత మాత్రం గెలుపు తమదే అని ధీమాతో ఉన్నారు.