లక్షద్వీప్‌లు ఇప్పటి వరకూ చర్చకురాని అంశాల్లో హైలెట్ అవుతోంది. అక్కడ రాజకీయంగా ఎప్పుడూ అలజడి లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పర్యాటకంగా… మాత్రమే ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు బీజేపీ పుణ్యమా అని.. అక్కడ రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. అక్కడి ప్రజలపై ఏకంగా దేశద్రోహం కేసులు పెట్టేస్తున్నారు. దీంతో సేవ్ లక్షద్వీప్ అంటూ.. ఉద్యమం కూడా ప్రారంభమయింది. లక్షద్వీప్ జనాభా లక్ష కూడా ఉండదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, లక్షద్వీప్ మొత్తం జనాభాలో 96 శాతం ముస్లింలు. ఎక్కువగా కేరళతో అనుబంధం ఉంటుంది. అక్కడి భాష కూడా మలయాళమే. ఈ లక్షద్వీప్కుఇటీవల… గుజరాత్‌కు చెందిన ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన ప్రఫుల్ పటేల్ అనే పెద్దమనిషిని.. లక్షద్వీప్ అడ్మినస్ట్రేటర్ గా నియమించారు.
ప్రఫుల్ పటేల్ ఎప్పుడైతే అక్కడ అడుగుపెట్టారో.. అప్పుడే అశాంతి ప్రారంభమయింది. ఆయన లక్షద్వీప్‌కు కొత్త చట్టాలుప్రతిపాదించారు. పంచాయతీల పరిధిలో ఉన్న జీవనోపాధికి సంబంధించిన రంగాలను అడ్మినిస్ట్రేటర్ పరిపాలన కిందకు తీసుకువచ్చారు. లక్షద్వీప్‌లో నేరాలే ఉండవు.. అయినా గూండా చట్టాన్ని అమలు చేశారు. మద్య నిషేధం అమల్లో ఉంది. దాన్ని ఎతతేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని పలువురు లక్షద్వీప్ వాసులపై కేసులు పెట్టించారు. ఈ దీవుల్లో అధిక సంఖ్యలో ఉండేది మైనార్టీలే. వారంతా మాంసాహారులు. అయినప్పటికీ జంతువధను, బీఫ్‌ను నిషేధించారు.
కేరళలోని బైపూర్ నౌకాశ్రయం నుంచి అక్కడికి సరకులు రవాణా అవుతుంటాయి. అయితే కర్ణాటకలోని మంగుళూరు రేవు నుంచి తెచ్చుకోవాలని ఆదేశించారు. ప్రఫుల్ పటేల్ తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రఫుల్ పటేల్‌ను జీవాయుధంగా పేర్కొంటూ .. విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు చేసిన ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త అయిషా సుల్తానాపై దేశద్రోహం కేసు పెట్టారు. దీంతో ఉద్యమం మరింత రాజుకుంది. లక్షద్వీప్‌లో చిచ్చు పెట్టి..చివరికి బలవంతంగా కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారని చాలా మంది ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం అంతా ఆటాడిస్తూ… చూస్తూ కూర్చుంది. ప్రశాంతమైన లక్షద్వీప్ మాత్రం.. మండిపోతోంది.