“సమస్యను పరిష్కరించలేకపోతే భావోద్వేగాలు రెచ్చగొట్టడమే మార్గం..!”.. రాజకీయాల్లో ఇది ప్రాథమిక సూత్రం. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సమర్థంగా అమలు చేయలేవు. కానీ ఈ ఫార్ములాను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న రాజకీయ పార్టీలే ప్రస్తుతం సక్సెస్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల జల రాజకీయాల్ని … చూస్తే వారెందుకు అంత సక్సెస్ అయ్యారో అర్థమైపోతుంది. అందరూ.. ఎవరికి వారు తమ తమ సంబంధాలను గొప్పగా ఉంచుకున్నారు. కానీ రాజకీయంగా వచ్చేసరికి… ” సహించబోమని.. అదనీ.. ఇదనీ..” ప్రజల కోసం ప్రకటనలు చేసేస్తున్నారు. ఇదంతా సమస్యను మరింత చిక్కుముడి వేయడానికే తప్ప… పరిష్కరించి ప్రజలకు మేలు చేయడానికి కాదు..!
బేసిన్లు..భేషజాలు లేవుగా.. మళ్లీ ఇప్పుడెందుకొస్తున్నాయి..?
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా జలజగడం ప్రారంభమయింది. వాస్తవానికి కొత్తదేమీ కాదు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వివాదాలున్నాయి. పాత ప్రాజెక్టులంటూ.. తెలంగాణ సర్కార్ కట్టుకోవాల్సినవి కట్టుకున్నాయి. ఏపీ పట్టిసీమ, ముచ్చుమర్రి లాంటివి శరవేగంగా కట్టుకుంది. రెండు రాష్ట్రాలు ఒకరు కట్టుకుంటున్న ప్రాజెక్టులపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అంతకు మించి అప్పటి ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా కూడా దూషించుకున్నారు. చంద్రబాబు ఉంటే ఆ జలజగడాలు తీరవని.. జగన్ రావాల్సిందేనని.. పొరుగు రాష్ట్రం పెద్దలు అనుకున్నారు. టీఆర్ఎస్ అధినేత … ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి మళ్లీ విజయం సాధించడంతో ఏపీలో ఎన్నికలపై ఆయన ముద్ర వేయడానికి అవకాశం చిక్కింది. జగన్ గెలిస్తే.. ఆంధ్రతో నీటి పంచాయతీనే ఉండదని… గొడవలు ఉండవన్నట్లుగా చెప్పి.. ప్రజల్ని ప్రభావితం చేయగలిగారు. అందుకే… జగన్ ప్రమాణస్వీకారానికి వచ్చి.. బేసిన్లు బేషజాలు లేవని.. కేంద్రం వద్దకు పంచాయతీకి వెళ్లాల్సిన పని లేదని.. తామే పరిష్కరించుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. దానికి మహారాష్ట్రతో తాము కుదుర్చుకున్న ఒప్పందాలను సాక్ష్యంగా చూపించారు. జగన్ కూడా నమ్మారో లేక… అదంతా రాజకీయ ప్రణాళికలో భాగమో కానీ… ఏపీ ప్రయోజనాలను దారుణంగా దెబ్బకొట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అది అసలు అక్రమ ప్రాజెక్ట్ అని ఏపీ ప్రభుత్వం… పోరాడుతోంది. అయినా ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. కానీ ఏడాది తిరిగే సరికి సీన్ రివర్స్ అయింది. అది అక్రమ ప్రాజెక్టేనని జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇక ఆ ఫిర్యాదుకు విలువ ఉంటుందా..?
ఇద్దరు ముఖ్యమంత్రుల స్నేహం జలజగడం పరిష్కరించుకోవడానికి పనికి రాదా..?
కేసీఆర్ – జగన్ ఇప్పటికి ఆప్తులు. వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాల్లేవు. ఈ విషయాన్ని ఇటీవల కేసీఆర్.. ఏపీ పై వ్యక్తం చేసిన ఆగ్రహ పాఠాన్ని ఓ సారి పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఆయన ఎక్కడ జగన్ పేరు ఎత్తలేదు. ఏపీ పెద్దలని పీటేసి అన్నం పెడితే.. కెలికి కయ్యం పెట్టుకుంటున్నారని… అన్నారు. మొత్తం ఏపీకి అన్వయించారు కానీ.. ఎక్కడా జగన్ పేరు ఎత్తలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా.. కేసీఆర్.. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అలా అని ఉంటారని దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని… అధికారులతో చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే.. ఎవరి రాజకీయ అవసరాల కోసం.. వారు ఇతరులపై విమర్శలు చేసుకునే అవగాహన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉందని స్పష్టమవుతోంది. ఈ అవగాహన … ప్రజలకు ఉపయోగపడే .. జల వివాదాల పరిష్కారానికి ఎందుకు ఉపయోగించుకోరు అనేదే ఇక్కడ ప్రశ్నర్థాకం.,
పోతిరెడ్డిపాడు పేరుతో ఏపీ సర్కార్ తెలంగాణను ఎందుకు రెచ్చగొట్టింది..?
ఏపీ భూభాగంలో రాయలసీమ ఎత్తిపోతల కట్టాలని జగన్ అనుకున్నారు. దానికి హడావుడి చేయాల్సిన పని లేదు. అంతకు ముందు పట్టిసీమ కట్టినట్లుగా… ముచ్చుమర్రి కట్టినట్లుగా పని పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ తాము పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని… పునాది వేయక ముందే ప్రచారం చేయడంతో తెలంగాణలో రాజకీయ సెంటిమెంట్ ప్రారంభమయింది. అది కూడా ప్రణాళికా బద్ధంగా జరుగుతోంది. ఏపీలోనూ.. అలాంటి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. అంటే.. జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి… పరస్పర అవగాహనతోనే జల వివాదం సృష్టించుకుని.. ప్రజల్లో భావోద్వేగం రెచ్చగొట్టే రాజకీయానికి తెర తీశారని అనుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ముందు ముందు ఈ రాజకీయం.. రెండు రాష్ట్రాల్లోనూ ఓ రేంజ్లో జరిగే అవకాశం ఉంది. పందొమ్మిదో తేదీన జగన్మోహన్ రెడ్డి సర్కార్ టెండర్లను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రభుత్వాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తాయి. మధ్యలో… విపక్షాలను లాగి… అవి ఆయా ప్రాంతాలకు వ్యతిరేకం అనే రాజకీయం చేస్తాయి. ఇది రాజకీయంగా ఉభయులకూ తారకం. కానీ.. ప్రజల సంగతేంటి..? రైతుల సంగతేంటి..? ఇలా వివాదం సృష్టిస్తే.. రాయలసీమ ఎత్తిపోతల అనేది సాధ్యం కాని పని…! రాజకీయంతో అధికార పార్టీలు లాభపడతాయి.. కానీ రాయలసీమ రైతుల సంగతేంటి..?
కనీసం ఆర్టీసీ బస్సుల పర్మిషన్ ఇప్పించుకోలేకపోయిన ఏపీ సీఎం..!
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో రాజీపడ్డారు. ఒక్క నీటి విషయంలోనే కాదు.. ప్రతీ విషయంలోనూ…తెలంగాణకు జీ హూజూర్ అనే పరిస్థితి ఉంది. శ్రీశైలంలో కొద్ది మొత్తంలో నీరు చేరగానే.. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడమే కాదు.. సాగర్ ఆయుకట్టుకు నీరు విడుదల చేసేసుకుంటోంది. కానీ.. శ్రీశైలంలో 854 అడుగులు చేరిన తర్వాత కూడా ఏపీ సర్కార్ సీమకు నీరు విడుదల చేయడనికి బద్దకించింది. ఇక చరిత్రలో కలిసిపోయిన…తెలంగాణ సెక్రటేరియట్ భవనాల్లో ఐదు .. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. వాటికి పరిహారం గురించి ఒక్క మాట కూడా.. తెలంగాణతో మాట్లాడలేదు. ఇప్పుడవి కాలగర్భంలో కలిసిపోయాయి. ఏపీకి .. తెలంగాణ ఐదు వేల కోట్ల వరకూ విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. సత్సంబంధాల కోసం జగన్ వాటిని మర్చిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే… తెలంగాణ మొత్తం ప్రయోజనాలు పొందింది కానీ..ఏపీకి చిన్న ఫేవర్ కూడా దక్కలేదు. సుప్రీంకోర్టు చెప్పినా.. విద్యుత్ ఉద్యోగుల్ని తెలంగాణ తీసుకోవడం లేదు. చివరికి ఆర్టీసీ బస్సులను తిప్పుకోవడానికి కూడా తెలంగాణ సర్కార్ అనేక షరతులు పెడుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి 90 శాతం బస్సులు గతంలో ఏపీఎస్ఆర్టీసీవే తిరిగేవి. లాక్ డౌన్ తర్వాత అలా తిప్పుకోవడానికి లేదని.. ఏపీఆర్టీసీ ఎన్ని బస్సులు తిప్పితే.. తెలంగాణ కూడా అన్నే తిప్పుతుందని తేల్చేశారు., ఈ వివాదం తేలక.. బెంగళూరుకు బస్సులు నడుపుతున్నారు కానీ.. హైదరాబాద్‌కు నడపలేకపోతున్నారు. కానీ.. ఇవన్నీ.. ముఖ్యమంత్రలు జగన్ – కేసీఆర్ మధ్య సత్సంబంధాలకు అడ్డు కాదు.
తెలంగాణ కోణంలో కేసీఆర్ వంద శాతం కరెక్ట్..!
ఈ విషయంలో కేసీఆర్ శైలిని అభినందించక తప్పదు. ఆయన రాజకీయం చేసుకున్నా.. ఎక్కడా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రయత్నమే చేయరు. అది నీరు అయినా… ఉద్యోగాలు అయినా.. మరొకటి అయినా.. తెలంగాణకు వీసమెత్తు నష్టం జరగకుండా.. రాజకీయం చేసుకుంటారు. అందులో ఆయన మాస్టర్. కానీ… ఏపీ ప్రభుత్వ పాలకులే… తమకు రాజకీయ ప్రయోజనాలు .. కేసీఆర్‌తో స్నేహం ఉంటే చాలు.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ఉన్నా.. ప్రజల్ని మేనేజ్ చేసుకోవచ్చని అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు.. మేనేజ్ చేసేసుకుంటున్నారు కూడా. ప్రజలు ప్రస్తుతానికైతే… “మాకేంటి..?” అన్న పద్దతిలో ఉన్నారు కాబట్టి.. జగన్ ఫార్ములా సక్సెస్ ఫుల్ అయిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే రాజకీయం జోరుగా నడుస్తోంది. అయితే.. ఇవాళ కాకపోతే.. రేపయినా.. ప్రజలకు.. మాకేంటి..? అనుకునే పరిస్థితి నుంచి మన రాష్ట్రానికేంటి..? అనే ఆలోచన స్థాయికి వస్తే మాత్రం.. గడ్డు పరిస్థితులు వస్తాయి. అలా రాకుండా చేయడంలోనూ.. రాజకీయంగా సిద్ధహస్తులే కాబట్టి ఢోకా ఉండకపోవచ్చు.
ఈ జల రాజకీయం ఆగదు.. ప్రజల్ని భావోద్వేగానికి గురవ్వాల్సిందే..!
సమస్యలు పరిష్కరించుకోవాలంటే.. కేసీఆర్‌కు చిటికెలో పని. అటు మహారాష్ట్రతో అయినా.. ఇటు కర్ణాటకతో అయినా సమసల్ని అలానే పరిష్కరించుకున్నారు. ఎందుకంటే.. ఆయా రాష్ట్రాల్లో వారికి రాజకీయ ఆసక్తులు లేవు. తెలంగాణ ప్రయోజనాలే ఉన్నాయి. ఎంతో కొంత త్యాగం చేసి.. అత్యధిక లాభం పొందాలనే మార్గంలో కేసీఆర్ విజయవంతం అవుతున్నారు. కానీ ఏపీతో అలా కాదు.. ఆయనకు రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఏపీలో తనకు ఇష్టమైన సర్కార్ .. తన చెప్పినట్లు వినే సర్కార్ ఉంటేనే.. తెలంగాణ వృద్ధికి అవకాశం లభిస్తుంది. అందుకే… కేసీఆర్ … ఏపీతో రాజకీయం చేస్తున్నారు. దానికి జగన్ సహకరిస్తున్నారు. అంతిమంగా రాజకీయంగా ముఖ్యమంత్రులిద్దరూ లాభపడతారు. అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే నష్టపోతుంది. ఈ తెలివిడి ముఖ్యమంత్రి జగన్‌కు ఉండొచ్చు కానీ.. ప్రజలకు లేదు. అందుకే.. అంతా రాజకీయం నడిచిపోతుంది.