ప్రశాంత కోనసీమ జిల్లాను అట్టుడికేలా చేసిన నిందితులు.. దాడులకు పాల్పడిన వారు.. వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టిన వారు ఎవరో వీడియో రికార్డుల్లో స్పష్టంగా ఉంది. వారెవరో సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా బయటవారు ఎవరూ రాలేదని చెబుతున్నారు. అంటే.. దాడులకు పాల్పడిన వారు ఎవరు.. వారిని ప్రోత్సహించిన వారు ఎవరు అన్నది అందరికీ స్పష్టంగా తెలుసు. మరి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు ? వారిని పట్టుకుంటారా లేక యథాప్రకారం రాజకీయం చేసి మసి పూసి మారేడుకాయ చేసి నిందితుల్ని వెనకేసుకొస్తారా ?
ఓ వైపు అల్లర్లు జరుగుతూ ఉండగానే .. జనసేన, టీడీపీ నేతలే ఈ అల్లర్ల వెనుక ఉన్నారని హోంమంత్రి ప్రకటన చేశారు. ఆమె పరిస్థితుల్ని సమీక్ష చేసి.. సర్దుబాటు చేయాల్సిన పని వదిలేసి..ఇలా మీడియాకు విపక్షాలపై ఆరోపణలు చేస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సరే గతంలో హోంమంత్రి ఉన్నా అదే చేసేవారనుకున్నా.. అసలు చేయాల్సిన పని చేయాలి కదా. ! నిందితుల్ని అరెస్ట్ చేయాలి కదా ! ఎవర్నీ వదిలి పెట్టబోమని గంభీరంగా ప్రకటనలు చేశారు. చివరికి బాధితుడైన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా అదే్ చెప్పారు. కానీ నిందితుల్ని ఇప్పటి వరకూ గుర్తించను కూడా లేదు.
దాడులకు పాల్పడిన వారెవరో.. ఫోటోలు వీడియోలతో సహా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. వారంతా మంత్రి విశ్వరూప్ అనుచరులేనని చెబుతున్నా రు. ఆయన అనుచరులు ఆయన ఇంటిపైనే దాడికి పాల్పడటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అందుకే ఇదంతా రాజకీయ కుట్ర అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే నిజం అయితే పోలీసులు నిందితుల్ని కాకుండా ఇతరుల్ని అరెస్ట్ చేసి రాజకీయం చేయడం ఖాయమే. అమలాపురం ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్న సందేశాలు పంపకపోతే.. అల్లరి మూకలు.. ధైర్యంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.