తెలంగాణ రాజకీయాల్లో పేపర్ లీక్స్ రాజకీయాలు పీక్స్‌కు చేరుకున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో డ్యామేడ్ అయిన ప్రభుత్వ ఇమేజ్ ను కాపాడుకోవడానికే తంటాలు పడుతూంటే… టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ వ్యవహారం ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెట్టింది. దీన్ని బీజేపీపై తోసేయడానికి బండి సంజయ్ వాట్సాప్ కు వెళ్లిన ఓ పేపర్ ఉపయోగపడింది. ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్టు పదకొండున్నరకు పంపిన ఓ లీక్ అయిన ప్రశ్నపత్రం ఆధారంగా బండి సంజయ్‌పై కుట్ర కేసు పెట్టి లోపలేశారు. ఆయన బెయిల్ తెచ్చుకున్నారు.
కానీ ఈ కేసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు పేపర్ బయటకు తెచ్చింది ఎవరు ? ఫోటో తీసింది ఎవరు ? మొదట ఎవరికి పంపారు ? ఇవన్నీ కీలకం. వారే కుట్రదారులవుతారు. కానీ పోలీసులు ప్రశాంత్ అనే వ్యక్తి పదకొండున్నరకు బండి సంజయ్‌కు పత్రం పంపారని.. ఆ ప్రశాంత్ తో బండి సంజయ్ మాట్లాడారని చెబుతున్నారు. ఆయన మాజీ జర్నలిస్టు. మాట్లాడితే కుట్ర ఎలా అవుతుందో పోలీసులు నిరూపించలేకపోయారు. అసలు పబ్లిక్ డొమైన్‌లోకి పేపర్ వచ్చాక అది లీక్ ఎలా అవుతుందని హైకోర్టు కూడా ప్రశ్నించింది.
పేపర్ లీకులతో ప్రభుత్వ సమర్థతపై ఏర్పడుతున్న సందేహాలను ప్రతిపక్షాలపై నెట్టి.. వారే కుట్రలు చేశారని ప్రజలను నమ్మించే ఓ బలమైన ప్రయత్నం చేశారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈవ్యవహారంతో టీఎస్పీఎస్సీ పేపర్ ల లీక్ విచారణపై ఫోకస్ తగ్గిపోయింది. నిజానికి టెన్త్ పేపర్లు లీక్ కాలేదు.. కానీ టీఎస్పీఎస్సీ పేపర్లు లీకయ్యాయి. వాటిపై అసలు నిందితుల్ని పట్టుకోవాల్సి ఉంది. కానీ కింది స్థాయి వారినే టార్గెట్ చేసుకుంటున్నారు.
మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో లీకులు ఇప్పుడు కీలకం అయ్యాయి. ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.