టీడీపీ నేత, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్.. ప్రతీ రోజూ…నిద్ర లేవగానే తాను పార్టీ మారబోవడం లేదని.. ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన వైసీపీలో చేరుతారని.. కొంత కాలంగా… సోషల్ మీడియాలో.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దేవినేని అవినాష్.. ఎంత గట్టిగా ఖండించినప్పటికీ.. అవి ఆగడం లేదు. ఒక నెల రోజులు.. సైలెంట్ గా ఉంటారు.. మళ్లీ ప్రచారం ప్రారంభిస్తారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటాయని భావిస్తున్న కొన్ని సోషల్ మీడియా పేజీల్లోనే…ఇటీవల దేవినేని అవినాష్‌పై పార్టీ మార్పు ప్రచారం చేశారు. జగన్ తో సమావేశమయ్యారని.. మరొకటని.. విపరీతంగా ట్రెండ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో.. అవినాష్ అసహనానికి గురవుతున్నారు. తన ఎదుగుదలను సహించలేక… పొగ పెడుతున్నారని ఆయన అంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా… దేవినేని అవినాష్‌ను చేర్చుకునేందుకు ఆసక్తితో ఉంది. ఆ పార్టీ మైండ్‌గేమ్‌లో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం కూడా ఉంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న వైసీపీ…. ముందుగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల.. నేతల్ని చేర్చుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. గతంలో.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన దేవినేని నెహ్రూ కుమారుడు.. అవినాష్‌పై జగన్ దృష్టి పెట్టారని అటున్నారు. ఆయనను పార్టీలోకి తెచ్చేందుకు మైండ్ గేమ్.. పార్టీ మార్పు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారని చెబుతున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతలతో పాటు… పార్టీలోనూ తగినంత ప్రాధాన్యం ఇస్తామని … ఇప్పటికే కబురు చేశారు. కానీ దేవినేని అవినాష్ మాత్రం ఎప్పటికప్పుడు… వ్యతిరేకతతోనే ఉన్నారు. ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. తాజాగా.. తనపై వచ్చిన ప్రచారాన్ని కూడా అంతే ఖండించారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.