ముందస్తు ఎన్నికల రాజకీయంలో మినీ భారత్ గా పేరొందిన శేరిలింగంపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారుతోంది. పొత్తుల్లో.. సీటు తమకంటే తమకని కాంగ్రెస్, టీడీపీ కొట్లాడుకుంటున్నాయి. ఇదే అదనుగా గులాబీ పార్టీ తమ అభ్యర్ధిని గెలిపించేందుకు వ్యూహాలు పన్నుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ సంస్థలు అన్నీ కొలువు దీరి ఉన్నాయి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. దీనికి తోడు ఆంద్రా సెటిలర్ల ఓటు బ్యాంకు గెలుపు ఓటములను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2014 లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఏకంగా 75వేల మెజార్టీ సాధించిరు.. అదే టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి ఈ నియోజకవర్గం నుంచి దాదాపుగా 90వేల పై చిలుకు మెజార్టీ వచ్చింది. తరువాత పరిణామాలతో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ టీఆర్ఎస్లో చేరారు.
అరికెపూడి గాంధీతో టీడీపీ క్యాడర్ వెళ్లలేదు. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఈ స్థానం తమకే కావాలని టీడీపీ కోరుతోంది. చంద్రబాబు శేరిలింగంపల్లిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2009 లో 1300 ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి భిక్షపతి యాదవ్ పై పోటీ చేసి ఓడిపోయిన మొవ్వ సత్యనాయారణ టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. ప్రచారం చేసుకుంటున్నారు. అయితే.. చంద్రబాబు ఆశీస్సులు వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ కే ఉన్నాయని ఆయన వర్గీయులు చెప్పుకుంటూ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు మొవ్వా, వెనిగళ్ల వర్గాలు…కొట్లాడుకుంటున్నాయి. మధ్యలో సందట్లో సడేమియా అన్నట్లుగా భిక్షపతి యాదవ్ నేరుగా గాంధీభవన్ దగ్గర హంగామా చేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు. రాహుల్ గాంధీ తో తన నియోజకవర్గంలో సభ పెట్టించి టికెట్ ఖరారు చేసుకున్నానని ఆయన అంటున్నారు.
మరో వైపు శేరిలింగంపల్లి సీటు విషయాన్ని కేసిఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఏమాత్రం ఏమరుపాటు వద్దని నేతలను హెచ్చరించారు. కేటీఆర్ సిటిజన్స్ మీట్ లు పెడుతూ.. ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సెటిలర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తూనే.. స్థానిక టిఆర్ఎస్ నేతలను సమన్వయపరుస్తున్నారు. గాంధీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్పోరేటర్లు వ్యవహరిస్తుండడంతో అందర్నీ బుజ్జగించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని అసమ్మతిని.. టీఆర్ఎస్సే ప్రొత్సహిస్తోందన్న అనుమానాలు కూడా కాంగ్రెస్‌లో ఉన్నాయి. మూడు పార్టీలకు.. శేరిలింగం పల్లి హాట్ ఫేవరేట్‌గా ఉంది.