గుంటూరు, కృష్ణా జిల్లాల రాజకీయ నేతలు ప్రజల్ని ఆశ్చర్య పరుస్తున్నారు. రాజధానిని తమ ప్రాంతం నుంచి తీసేసి… ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిసినా… పోతే పోనీ.. తమకు జగన్ చల్లని చూపు ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్ వ్యూహంలో భాగం అయి… ప్రజల సెంటిమెంట్లను దెబ్బకొట్టడానికి కూడా.. వెనుకాడటం లేదు. రాజధాని తరలింపుకు నిరసనగా ఉద్యమం పల్లెల్లోకి వెళ్తుందని వైసీపీ పసిగట్టింది. ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా పార్టీ అగ్రనేతల వద్ద ఉద్యమం పెరుగుతుందని … ఇది పార్టీ పరంగా దెబ్బకొడుతుందని చెప్పారు. దాంతో.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేను టీడీపీకి దూరం చేసి.. జగన్కు మద్దతుగా మాట్లాడించారు. కోస్తాలోనే మరో ఇరువురు ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
రాజధాని ఉద్యమం మరింత ఉధృతమైతే ఆ ఇరువురి ఎమ్మెల్యేలను కూడా తమవైపుకు తిప్పుకొనేందుకు తెరవెనుక ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు ఈ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు. రాజధాని ఉద్యమానికి కోస్తా ఎమ్మెల్యేలే మద్ధతు ఇవ్వడంలేదనే పరోక్షంగా సంకేతాలు పంపడానికే.. ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రాజధానిని విశాఖకు తరలించాలన్న జగన్ నిర్ణయాన్ని కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు సమర్థించారు. అమరావతిని కట్టడానికి ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేనందున ఇప్పటికే నిర్మితమైన నగరానికి రాజధానికి తరలిస్తున్నారని.. దానికి సంపూర్ణ మద్దతు తెలిపినట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఏ పార్టీలో ఉన్నా… ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం.. జిల్లా ప్రయోజనాల గురించి పోరాడతారు. సొంత పార్టీ అన్యాయం చేస్తూంటే.. కనీసం ప్రశ్నిస్తారు.
కానీ గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం.. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలిస్తూంటే.. లైట్ తీసుకున్నారు. రాష్ట్రాభివృధ్ది కోసమే.. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని.. తాము సంపూర్ణంగా అంగీకరించామని నిర్మోహమాటంగా ప్రకటించారు. వైసీపీ ఆకర్ష్ దెబ్బకు గెలిచిన ప్రతిపక్ష పార్టీలో గెలిచిన అతి కొద్ది మంది కూడా.. రాజధానిపై ప్రజల సెంటిమెంట్లను పట్టించుకోకుండా.. జగన్ చల్లని చూపు కోసం.. క్యూ కడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో.. రాజధానిని తరలిస్తే..రాజీనామాలు చేస్తామని సవాళ్లు చేసిన నేతలు.. తమ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎమ్మెల్యేలు ఎవరూ.. ప్రజాభిప్రాయం గురించి కానీ.. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలించవద్దని..కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు.