విశ్వ విద్యాలయమంటే విద్యార్థి ఉజ్వల భవితకు బాటలు వేసే ప్రాంగణం. అక్కడ చదువుకోవాలే గానీ చావే శరణ్యమనుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే దళిత విద్యార్థి ఆత్మహత్య, మనసున్న ప్రతి ఒక్కరినీ బాధించింది. అతడి తల్లిదండ్రులే కాదు, ఈ దేశం ఒక యువకుడిని కోల్పోయింది.
ఈమధ్య విశ్వవిద్యాలయాల్లో అనవసరైన రచ్చ ఎక్కువైంది. నరరూప రాక్షసుల్లాంటి ఉగ్రవాదులను ఉరితీసినా బాధపడే కొందరు మేధావులు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు. తమ విద్యాసంస్థల సభ్యత్వాలను పెంచుకోవడానికి ఆవేశాలను రెచ్చగొడుతున్నారు. బీఫ్ పార్టీలంటూ ఉద్రేకాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. సంచలనం పేరుతో సమాజంలో అశాంతిని రెచ్చగొట్టి రేటింగ్స్ పెంచుకునే అనేక టీవీచానళ్ల పుణ్యమా అని విద్యాలయాలు వివాదాల నిలయాలుగా మారాయి.
అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడులకు సూత్రధారి అయిన అఫ్జల్ గురును ఉరితీస్తే సెంట్రల్ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన ఎందుకు జరగాలి? అతడు మహాత్మా గాంధీ వంటివాడు కాదు. నరహంతకుడికి అనుకూలంగా ర్యాలీ జరిపిన వారు, లేదా చేయించిన వారి కుటుంబ సభ్యులెవరైనా ఉగ్రదాడిలో మరణించి ఉంటే ఆ భాధ ఏమిటో తెలిసేది. అలాగే ముంబై బాంబు పేలుళ్లలో వందల మంది మరణానికి కారకులైన వారిలో యాకూబ్ మెమన్ ఒకడు. అలాంటి వాడికి అనుకూలంగానూ సెంట్రల్ యూనివర్సిటీలో ర్యాలీ జరిపారట. వామపక్ష విద్యార్థి సంఘాల పేరుతో అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వాటిలో సెంట్రల్ యూనివర్సిటీ ఘటన ఒకటి.
రోహిత్ ప్రతిభగల విద్యార్థి. మేధావుల పేరుతో విద్యార్థులను తప్పుదారి పట్టించే వారి చేతిలో ఎంతో మంది విద్యార్థులు కీలుబొమ్మలుగా మారుతున్నారు. అలాంటి వారిలో రోహిత్ ఒకడని మిత్రులు చెప్తున్నారు. అతడి ఆత్మహత్య తర్వాత క్యాంపస్ లో ఆవేశకావేశాలు పెరిగాయి. కేంద్ర మంత్రి వల్లే అతడు మరణించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇంతా చేసి, వీరిని రెచ్చగొట్టిన మేధోవర్గం జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఒకవేళ డాక్టర్ అంబేడ్కర్ జీవించి ఉంటే, నరహంతకులైన అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్ లను ఉరి తీయవద్దని ధర్నా చేసే వారా?
వ్యక్తిగత జీవితం కంటే దేశహితానికే ప్రాధాన్యం ఇచ్చిన మహామనిషి డాక్టర్ అంబేడ్కర్. ముంబై బాంబు పేలుళ్లకు పాల్పడ్డవాడిని, పార్లమెంటుపై దాడికి సూత్రధారిని వదిలిపెట్టాలని, ఉరితీయ వద్దని అంబేడ్కర్ అనేవారని ఎవరైనా అంటే, ఆ మహానుభావుడిని అవమానించడమే. రోహిత్ ఆత్మహత్య తర్వాత ఎస్.ఎఫ్.ఐ., ఎన్.ఎస్.యు.ఐ. వంటి విద్యాసంస్థలు హైదరాబాదులో, ఢిల్లీలో వీరావేశంతో విచుకుపడ్డాయి. ఆందోళనలు చేశాయి. ఉగ్రవాదులను ఉరితీయాలా వద్దా, దేశ ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాలా వద్దా అనే ప్రశ్నకు అవి జవాబు ఇవ్వాల్సి ఉంది.
ఎవరో తప్పుదారి పట్టించడం వల్ల చివరకు ప్రాణం తీసుకున్న రోహిత్ తల్లి గుండెకోత వారికి అర్థమవుతుందా? చెట్టంత కొడుకు ప్రాణాలు తీసుకుంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లి ఉంటుంది? పబ్బం గడుపుకోవడానికి విశ్వవిద్యాలయాలను విష ప్రచార కేంద్రాలుగా మార్చే కొన్ని సంస్థల వారు ఇకనైనా తమ శాడిస్టు బుద్ధిని మానుకుంటారని ఆశిద్దాం. ఎ.బి.వి.పి. విద్యార్థుల ఫిర్యాదును యథాతథంగా సంబంధింత శాఖ మంత్రికి పంపే ముందు, ఇది ఎంత సున్నితమైన అంశమో దత్తాత్రేయ ఆలోచించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు. యూనివర్సిటీ వ్యవహారాల్లో రాజకీయాలు అనర్థానికి దారి తీస్తాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.