తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ అసహనం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దాడులే సమాధానం అన్నపద్దతికి వెళ్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నలపై వేర్వేరు చోట్ల దాడులు జరిగాయి. ఇది రాజకీయంగా కలకలం రేపుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..వరంగల్లో ప్రెస్మీట్ పెట్టారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ ప్రెస్మీట్ అయ్యేలోపు… టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై విరుచుకుపడ్డారు. అర్వింద్ వెళ్తున్న సమయంలో దాడి చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు.. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు.
మరో వైపు.. తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన ఓ ఫిర్యాదు విషయంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యేందుకు వెళ్తున్న.. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పై… నిజామాబాద్ శివార్లలోనే దాడి జరిగింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు హైలెటయ్యాయి. ఈ దాడి చేసింది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అనుచరులన్న ప్రచారం జరుగుతోంది. తీన్మార్ మల్లన్న కొద్ది రోజులుగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సెటైరికల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆయన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో ఉండటంతో.. పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ.. మల్లన్న వెనక్కి తగ్గడం లేదు.
ఓ వైపు ఎంపీపైన.. మరో వైపు జర్నలిస్టుపైనా.. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటే… విమర్శలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారన్న అభిప్రాయం.. ఏర్పడుతుంది. తమ ఎంపీపై దాడిన బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఎంపీ అర్వింద్ ను.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా.. పలువురు పరామర్శించారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న సంగతిని మర్చిపోవద్దని.. బండి సంజయ్… టీఆర్ఎస్ సర్కార్కు ఘాటు హెచ్చరిక పంపారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలని టీఆర్ఎస్ అనుకుంంటోందని.. అందుకే.. దూకుడు పెంచిందిందని…భావిస్తున్నారు. ఈ క్రమంలో.. రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.