అధికార బీఆర్ఎస్ పార్టీని తమ ప్రత్యర్థి పార్టీలతో జత చేసి ముక్కోణపు పోటీలో లాభపడే వ్యూహాలను తీవ్రంగా అమలు చేస్తున్నాయి కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలు. ఈ వ్యాఖ్యలు- చూస్తున్న ప్రజలలో గందరగోళం సృష్టించే సంగతి ఏమో కానీ వినోదం మాత్రం విరివిగా పంచుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
శనివారం చేవెళ్ల సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ బిజెపి పార్టీలు ఒకటేనని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బిజెపి అధిష్టానంతో దోస్తీ కుదిరినందునే ఆ పార్టీ నాయకులు కెసిఆర్ ను విమర్శించకుండా మౌనంగా ఉన్నారని అన్నారు. దేశంలో బిజెపిని వ్యతిరేకించే 28 పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని ఈ కూటమి అనేక సమావేశాలు ఏర్పాటు చేసిందని, అయితే వీటిలో ఒక సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదని, దీన్నిబట్టి ఆయనకు బిజెపితో ఒప్పందం కుదిరిందని అర్థమవుతుందని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
అయితే ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేయగా ఆదివారంనాడు ఖమ్మం సభలో బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పూర్తిగా దీనికి వ్యతిరేక దిశలో వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియాగాంధీ కుటుంబం కోసం పనిచేస్తున్నారని, ఈ రెండు పార్టీలు గతంలో పొత్లు కూడా పెట్టుకున్నాయని, రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ కి ఓటు వేసినా కాంగ్రెస్ కి ఓటు వేసినా ఒకటేనని, ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో కెసిఆర్ బిజెపికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు.
అయితే ఇదే సభలో మాట్లాడిన బిజెపి జాతీయ నేత అమిత్ షా, కెసిఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి అని, కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
అయితే టిఆర్ఎస్ పార్టీని ప్రత్యర్థి పార్టీలతో జతకట్టి టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు తమకు బదిలీ అయ్యేలా చేసుకోవడానికి జాతీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో గందరగోళం సృష్టించగా, మరి కొందరు మాత్రం జాతీయ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, వినోదాన్ని పంచుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు నిజంగా తెలంగాణలో లో హంగ్ ప్రభుత్వం ఏర్పడే పక్షంలో ఈ రెండు జాతీయ పార్టీలు కూడా టిఆర్ఎస్ తో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెంపర్లాడతాయి అనడంలో సందేహం లేదని వారు విశ్లేషిస్తున్నారు.
ఎన్నికలు సమీపించడంతో ఈ తరహా వ్యాఖ్యలు భవిష్యత్తులో మరింతగా వినే అవకాశం కూడా కనిపిస్తోంది..