రాజ్యసభ స్థానాలకు ఇప్పటి వరకూ వెలువదిన పేర్లు చూస్తే అధినేతలు విధేయతకు లేదా బందానికి పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. కెసిఆర్ తన బంధువు ఆత్మీయుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఎంపిక చేసి సాన్నిహిత్యం విలువ చూపించారు.
పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్ ఎంపికలో మాత్రం ఢిల్లీ సంబంధాలు దృస్టిలో పెట్టుకున్నారనుకోవాలి. కాంగ్రెస్ మాజీలూ అందులోనూ పిసిసి అద్యక్షులు కాబట్టే గతంలో కేశవరావును, ఇప్పుడు డి.ఎస్‌ను ఎంపికచేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వలావాదేవీలకూ ఇతర పార్టీలతో సంబంధాలకు ఉపయోగపడే వ్యక్తి రాజ్యసభలో వుండాలని ఆయన కోరుకున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్‌తో గత సంబంధాలే గాక ఫలితాలను బట్టి భవిష్యత్తు బంధాలు కూడా ముఖ్యమేనని ఆయనకు తెలుసు. లోక్‌సభ ఎంపిలు, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి వున్నారు గనక పనులు చేయించుకోవడానికి సమస్య లేదు గాని పెద్దల సభలోనూ తగు ప్రాతినిధ్యం వుండాలన్నది ఇక్కడ సూత్రం. కవిత కూడా ఇందుకుగట్టిగా మద్దతునిచ్చిందంటున్నారు. బహుశా మరెవరికన్నా డిఎస్ అయితే తనకు స్వేచ్చ వుంటుందని ఆమె భావించారు. వీరంతా కాంగ్రెస్‌లో వుండగానే కెసిఆర్తోవిస్త్రత సంబంధాలు కలిగిన నేతలు. డిఎస్ పెద్ద మనిషిలా వ్యవహరిస్తూ అదిష్టానం చెప్పిందిచేసుకుపోయే వ్యక్తి గనక కెసిఆర్‌కు ఎలాటి ఇబ్బంది వుండదు. కాంగ్రెస్ నుంచి మరింత మందిని లాగడానికి కూడా తోడ్పడతాడనే అంచనా వుంది. 2004లో వైఎస్ అభీష్టం కన్నా డిఎస్ పిసిసిఅద్యక్షుడుగా వుండటమే టిఆర్ఎస్తో పొత్తుకు మూలకారణమైంది. తర్వాత కూడా వారు సంబంధాలు కొనసాగించారని భావించాలి. కనుకనే రాగానే ప్రత్యేక సలహాదారు హౌదా ఇవ్వడమే గాక ఇంటికి వెళ్లి మరీ గౌరవించారు. కనుక ఈ బంధం దృఢమైనదీ పాతదీ! సోనియా గాంధీ తెలంగాణ ఏర్పరచడం ఖాయమని 2013లో నాకు ముందుగానే చెప్పిన వ్యక్తి డిఎస్. మీతో అన్నారా అంటే లేదు, బాడీ లాంగ్వేజ్ ఇతర అంశాలను బట్టి చెప్పగలుగుతున్నానని స్పష్టంగా తెలిపారు. అంటే ఆయనకు సమాచారం వుండబట్టే చెబుతున్నారని నాకు అర్థమైంది. అప్పుడది పతాకశీర్షికలో వార్తగా రాశాం.
ఇక ఎపిలో వైఎస్ జగన్ విజయసాయి రెడ్డిని పంపిస్తారన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. వారిద్దరిపై కేసులు వంటివాటిని కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ అన్ని ఘట్టాల్లోనూ పక్కనే వున్నాడు గనకే ప్రత్యర్థుల ఆఫర్లు తిరస్కరించాడు గనకే సాయిరెడ్డిని ఎంపిక చేశానని జగన్ ప్రకటించారు. ఆ పార్టీలో కాస్త వ్యవస్థాగత విషయాలు పాటించేలా జగన్‌కు చెప్పగలిగింది విజయసాయి వొక్కరే నని చెబుతుంటారు. అంతకంటే కూడా డిల్లీలో సంబంధాలు కేసుల వ్యవహారాలు చూసేందుకు ఆయన బాగా ఉపయోగపడతారని ఆలోచన వుండొచ్చు. ఆడిటర్నుంచి రాజ్యసభకు వెళ్లడం విజయసాయికి కొత్త అనుభవమే. ఈ హౌదావల్ల ఆయనకు కూడా ఎంపిగా కొన్ని రక్షణలు లభిస్తాయి. మొత్తంపైన ఈ ఎంపికల్లో వ్యక్తిగత విధేయతలూ వినిమయ విలువలూ ప్రభావం చూపినంతగా ప్రజల కోణం లేదనేది స్పష్టం. అయితే సాయిరెడ్డి ఎంపికపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నేతలు తమ వారిపై వున్న కేసులను కూడా మర్చిపోవడానికి లేదు. కాకపోతే వీరిపైన బాగా ఎక్కువగా వున్నాయి.అవి తేలేవరకూ నిందితులుగానే చూడకతప్పదు. ఇక్కడ తెలుగుదేశంకు సాయిరెడ్డి ఎంపికకన్నా నాలుగో సీటు దక్కించుకోలేకపోవడమే ఎక్కువ బాధ కలిగిస్తుంది.