తమిళ స్టార్ హీరో విజయ్ కొత్తగా పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నానని, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించాడు. రాజకీయాలకు ముందు తన చివరి సినిమాగా ‘గోట్’ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇందులోని తొలి పాటగా ‘పార్టీ’ సాంగ్ బయటకు వదిలారు. పార్టీ అంటే రెండు అర్థాలున్నాయి. ఒకటి విందు. మరోటి రాజకీయాలకు సంబంధించినది. ఈ రెండు అర్థాల్నీ ఈ పాటలో తెలివిగా వాడేసుకొన్నాడు విజయ్.
”పార్టీ మరీ మొదలెడదమా
అలజడి పుట్టించేద్దామా
క్యాంపెనింగు స్టార్ట్ చేద్దామా
మైకు చేత పట్టుకొందామా..
పబ్లికు మొత్తం మనకే ప్లస్సు
పార్టీ పెడితే ఫుల్ సక్సెస్సూ..” ఇలా సాగాయి రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్.
ఓరకంగా ఇది సినిమా పాటే అయినా, తను రాజకీయాల్లోకి వస్తున్నానని, వస్తే తప్పకుండా విజయం సాధిస్తానని పరోక్షంగా మిగిలిన పార్టీలకు హెచ్చరికలు జారీ చేసిన పాటలా సాగింది. యువన్ శంకర్ రాజా బాణీలు అందించారు. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటలో ప్రభుదేవా, ప్రశాంత్ కూడా విజయ్ తో పాటు స్టెప్పులు వేశారు.