హుజురాబాద్ ఉపఎన్నికల కేంద్రంగా దళిత బంధు రాజకీయం మళ్లీ ప్రారంభమైంది. అనూహ్యంగా పోలింగ్‌కు పది రోజుల ముందు దళిత బంధు పథకాన్ని ఆపేయాలంటూ ఈసీ ఆదేశించింది. ఇది బీజేపీ కుట్రేనని టీఆర్ఎస్ అలా నోటీసులు రాగానే ఇలా ఆరోపణలు ప్రారంభించింది. ప్రేమేందర్ రెడ్డి అనే బీజేపీ నేత లేఖ రాశాడని కేటీఆర్ ఆరోపించారు. ఒక వారం ఆపుతారు.. ఆ తర్వాత ఆపగలరా అని ప్రశ్నించారు. వెంటనే బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.
వారు బయట పెట్టిన లేఖ ఫేక్ అని ఎంపీ అర్వింద్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టి పోశారు. ఈటల రాజేందర్ కూడా ప్రచారంలో స్పందించారు. తాము దళిత బంధును అడ్డుకుంటున్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. దొంగ ఉత్తరాలు పుట్టిస్తున్నారని .. తాను లేఖ రాసినట్లుగా నిరూపించాలన్నారు. దళిత బంధును ప్రకటించి రెండున్నర నెలలు అవుతుదందని ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి చేత కాకనే పథకం ఆపేయించారన్నారు.
మరో వైపు బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళితులపై కేసీఆర్‌కు ఏ మాత్రం పట్టింపు లేదన్నారు. ఎన్నికల కోడ్ కిందకు రాకుండా ఉండటానికే ముందు అమలు చేయడం ప్రారంభించారని ఇప్పుడు.. ఈసీ వద్దని లేఖ రాస్తే ఎందుకు ఊరుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తానికి అందరూ “క్రెడిట్”ను ఇతర పార్టీలకు అప్పగించడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ క్లెయిమ్ చేసుకోవడం లేదు.