ప్రజల చేత, ప్రజల కొరకు….అంటూ చిన్నప్పుడు చదువకున్న పాఠాల్లోనే చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మాస్టార్లు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కానీ, ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కానీ, ఇకపై జరగబోయే ఎన్నికల్లో కానీ ప్రజాప్రతినిధులందరినీ నిజంగా ప్రజలే ఎన్నుకుంటున్నారా? ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ప్రజలను ఎవ్వరూ ప్రభావితం చేయకూడదని చెప్పి, ఓటరు ఆలోచనలు గొప్పగా ఉండాలని చెప్పి పోలింగ్ రోజుల వరకూ మద్యం అమ్మకాలను కూడా నిషేధిస్తుంది ఎన్నికల కమిషన్. అలాగే ఏ రూపంలో అయినా సరే ఎన్నికల ప్రచారం చేయకూడదని చెప్పి నాయకులను కూడా కట్టడి చేస్తుంది. అలాగే మీడియావార్తల విషయంలో కూడా ఆంక్షలు విధిస్తుంది. ప్రజలు స్వేఛ్ఛగా ఓటేయడానికి ఆ నిబంధనలు చాలా?
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎనభైశాతం వరకూ అభ్యర్థులందరూ కూడా అయితే కోటీశ్వరులు….లేకపోతే నేరస్తులు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఈ రెండు కేటగిరీల అభ్యర్థుల శాతం పెరుగుతూనే ఉంది. భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన కథల్లో ప్రజాసేవపైన మక్కువ ఉండే….అస్థిత్వంలో ఉన్న పార్టీల విధానాలు నచ్చక, ఆయా పార్టీల్లో చేరలేనివాళ్ళలో ఎక్కువ మంది ఇండిపెండెట్‌గా పోటీచేసి గెలిచేవారు. అలా గెలిచినవాళ్ళలో ఎక్కువ మంది ప్రజాసేవ అంటే ఇష్టం ఉన్నవాళ్ళే ఉండేవాళ్ళు. ఆర్థికబలం, అంగబలం లేనివాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ బలాలు ఉన్న అభ్యర్థిని గ్యారెంటీగా ఏదో ఒక పార్టీవాళ్ళు లాగేసుకుంటారనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి మంచి స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉండడం రాజకీయ పార్టీల వాళ్ళకు ఇష్టం లేకుండాపోయింది. ఓట్లు చీలిపోతాయి అని, ఇంకోటనీ చెప్పి స్వతంత్రులకు అవకాశం లేకుండా చేశారు. పొలిటికల్ పార్టీలకు ఊడిగం చేసే మీడియా కూడా వాళ్ళ అభిప్రాయాలకు సపోర్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఎన్నికలను యుద్ధంగా మార్చేశాయి. అంగబలం ఉన్న నేరస్తులు, ఆర్థిక బలం ఉన్న కోటీశ్వరులను బరిలో నిలపడం మొదలెట్టాయి. ప్రజలకు కూడా వేరే ఆప్షన్ లేకుండా చేశాయి. డబ్బులు తీసుకుని ఓటేసేలాగా ప్రజలను ప్రేరేపిస్తుంది కూడా ఈ రాజకీయమే. ఇద్దరూ రౌడీలే అయినప్పుడు ఇక నిజాయితీగా ఓటేసి మాత్రం ఏంటి ఉపయోగం? ఎవరు గెలిస్తే మాత్రం ఏముంది? అనే నిరాశనిస్పృహలను ఓటర్ల ఆలోచనల్లో నింపడంలో పొలిటికల్ పార్టీల వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి రాజకీయమే చేస్తున్నారు. ఇండిపెండెంట్స్‌కి అవకాశం లేకుండా చేసి…..కోటీశ్వరులను, నేరస్తులను రంగంలోకి దింపుతున్నారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఈ బాపతు నేతలే అయినప్పుడు ఇక ప్రజలు గెలిపించడం ఏముంది? వాళ్ళ ఓటుకు ప్రాధాన్యత ఏముంది? అలాంటి వాళ్ళలో ఎవడో ఒకడు గెలిచిన తర్వాత….ఆ గెలిచినవాడు ప్రజల మన్ననలును ఎలా పొందాడు? ఎలా గెలిచాడు? అన్న విశ్లేషణలు మాత్రం ఎందుకు? అర్థబలం, అంగబలం ఉంది….గెలిచాడు అని చెప్పి ఈ రకం నేతల గురించి ప్రత్యేకంగా చెప్తే బాగుంటుందేమో. అప్పుడైనా ఆయా పార్టీల అధినేతలు నేరస్తులకు, కోటీశ్వరులకు టిక్కెట్స్ ఇవ్వడం తగ్గిస్తారేమో.